Drug gang arrested in Nagole : భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న రమేష్ అనే వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద సుమారు రూ. 15లక్షల విలువ చేసే 4.2కిలోల పాపీ స్ట్రా మత్తుపదార్థాలతో పాటు ద్విచక్ర వాహనం, రూ.1700 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన రమేష్ కుమార్ నగరంలో స్టీల్ వ్యాపారం చేస్తున్నాడు. అధిక డబ్బులకు అశపడి ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లో అతనికి పరిచయం ఉన్న చెన్నారామ్ అనే వ్యక్తి ద్వారా ఇక్కడికి పాపి స్ట్రా మొక్కలు తెప్పించి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చెన్నారామ్ వద్ద కిలో రూ.50వేలకు కొని ఇక్కడ రూ.3 నుంచి 4 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
Poppy straw drugs : పక్కా సమాచారంతో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ ఎస్‌వోటి ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం వివరించారు. పాపీ స్త్రా మత్తు పదార్ధం నుంచి మార్ఫిన్, హెరాయిన్‌ను తయారు చేస్తారని పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు సహా నిందితుడు రమేష్‌ను ఎస్‌ఓటి పోలీసులు చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు చెన్నారామ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
మత్తులో పడి జీవితాలు చిత్తు: డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న వాటిని విక్రయించే ముఠాలు మాత్రం రోజుకో కొత్త దారులు వెతుక్కుంటూ దర్జాగా క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నారు. యువతను మత్తులోకి నెట్టి.. బానిసలను చేస్తున్నారు. గత నెలలో పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్‌లోనే సుమారు 15 వేల మంది వరకు గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు పోలీసుల అంచనా. మత్తు పదార్థాలకు అలవాటు పడిన ప్రతి 15 మందిలో కనీసం ఇద్దరు.. వాటికి బానిసలవుతున్నారు.
మాదకద్రవ్యాల సమస్య మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా విస్తరించింది. నార్కోటిక్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 11.5 కోట్ల మంది డ్రగ్స్‌కు బానిసలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన చాలా అవసరమని పోలీసులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు డ్రగ్స్ వినియోగం వలనే కలిగే నష్టాలను వివరించాలని సూచిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు అవసరమని పోలీసులు అంటున్నారు.
ఇవీ చదవండి: