సాధారణ వైద్య సమస్యలున్న వారు ఆసుపత్రికి రానవసరం లేదని హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. మే ఒకటో తేదీ నుంచి ఫోన్ ద్వారా వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆరు విభాగాల సేవలు టెలి మెడిసిన్ విధానంలో తీసుకొస్తున్నామని, మరిన్ని సేవలు అందుబాటులో తీసుకొస్తామని పేర్కొన్నారు.
జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, రుమటాలజీ విభాగాలకు సంబంధించిన సేవలను టెలి మెడిసిన్ పద్ధతిలో అందించనున్నారు. ఫోన్ ద్వారా వైద్య సేవలు పొందాలనుకునే వారు 040- 23489244 నంబరులో లేదా నిమ్స్ వెబ్‌సైట్, నిమ్స్ హెచ్‌ఎంఐఎస్ యాప్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.
ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఫోన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు సంబంధిత వైద్యులు ఫోన్ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు.