Padma Rao Goud on Party Change: తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వదంతులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కొట్టిపారేశారు. తన ఊపిరి ఉన్నంత కాలం తెరాసను వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తను కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయినట్లు చెప్పడం సరికాదన్నారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు తనకు ఎలాంటి అడ్డులేదని.. కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు.
కేటీఆర్‌తో మునుగోడు ఎన్నికల విషయమై నిన్ననే చర్చించినట్లు పద్మారావు తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. భాజపాలోకి వెళ్తున్నట్లు కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని.. సోషల్ మీడియా వేదికగా భాజపా నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. బూర నర్సయ్య పార్టీ మారినంత మాత్రాన.. తాను కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు.
సికింద్రాబాద్‌లో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నామని.. ప్రజా అవసరాల దృష్ట్యా సేవలు అందిస్తున్నామన్నారు. సికింద్రాబాద్‌లో జూనియర్, డిగ్రీ కళాశాల, హైస్కూల్‌లో రూ.30 కోట్లతో విద్యార్థులకు అనువుగా నూతన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. మెట్టుగూడ, తుకారాం గేట్‌లో ఆర్‌యుబీ నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.102 కోట్ల నిధులు మంజూరయ్యాయని.. కళాశాలలు, వైద్యశాల ఏర్పాటుకు అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని.. మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తి కానున్నట్లు పద్మారావు వివరించారు.
"సత్యం గడప దాటక ముందే అసత్యం వీధులు దాటుతున్నాయి. నేను భాజపా లోనికి వెళ్లాల్సిన అవసరం ఏమిటి.. తెరాసలో నాకు ఎలాంటి లోటు లేదు. నాకు అందులో ఎవరితో విభేదాలు లేవు.. కిషన్‌రెడ్డితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన మా కుతురి పెళ్లికోసం వచ్చారు. దానికి అంతా భాజపాలోనికి వెళ్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. నీనే కాదు మా కుంటుంబంలో ఎవరు పార్టీ మారే ప్రసక్తి లేదు.. నా ఊపిరి ఉన్నంతకాలం తెరాసలోనే కొనసాగుతా".. -పద్మారావు, డిప్యూటీ స్పీకర్
ఇవీ చదవండి: