Reason for Passport Delay : స్వీయ తప్పిదాలతో పాస్‌పోర్టు ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో దరఖాస్తుదారులు తలలు పట్టుకుంటున్నారు. పొరపాట్లను సరిదిద్దుకుని మరోసారి స్లాట్ బుకింగ్ చేసుకునేలోపు విదేశాలకు వెళ్లే సమయం దగ్గర పడుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఏఆర్‌ఎన్ (అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్) షీట్‌లో సూచించే డాక్యుమెంట్ అడ్వైజరీని పరిశీలించాలని పాస్‌పోర్టు సేవాకేంద్రాల అధికారులు సూచిస్తున్నారు.
ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి: పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసే ముందే ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని చెబుతున్నారు. అమీర్‌పేట్‌లోని పాస్‌పోర్టు సేవా కేంద్రంలో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్.. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోగా 20 రోజులకు అపాయింట్‌మెంట్ లభించింది.
డాక్యుమెంట్లు తీసుకొని పాస్‌పోర్టు సేవా కేంద్రానికి వెళ్తే పరిశీలించిన అధికారులు ఆధార్‌కార్డు, జనన ధ్రువపత్రాల్లో తండ్రి పేరు స్థానంలో ఆయన పేరుకు ముందు ఇంటిపేరు ఉండటం, మరో ధ్రువపత్రంలో పేర్లు సరిపోలకపోవడంతో తిరస్కరించారు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. వీరందరికీ మరోసారి అనువైన సమయంలో అధికారులు స్లాట్ కల్పిస్తున్నా అత్యవసరమైనవారు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 10 వేల మంది స్లాట్ బుకింగ్ కోసం విదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో ప్రయత్నిస్తున్నారు. రోజూ నిజామాబాద్, కరీంనగర్, బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌకి పాస్‌పోర్ట్ సేవాకేంద్రాల్లో 4,500కుపైగా పాస్‌పోర్టులు జారీ అవుతున్నాయి. తత్కాల్‌లో బుక్ చేసుకున్నవారైతే ఏవైనా మూడు ధ్రువపత్రాలు సమర్పిస్తే చాలు. దరఖాస్తులో వివరాలు, పదోతరగతి ధ్రువపత్రం, ఆధార్‌కార్డులోని వివరాలు ఒకేలా 'ఉన్నాయో.. లేదో' పరిశీలించుకోవాలి.
ఇవీ చదవండి: