ఫ్లాట్ అప్పగింతలో జాప్యం జరిగితే ఒప్పందం ప్రకారం కొనుగోలుదారుకు పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. ఫ్లాట్ అప్పగింతలో జరిగిన జాప్యానికి రూ.3.5 లక్షల పరిహారం, ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలంటూ ఇమామి కన్‌స్ట్రక్షన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. కరపత్రం(బ్రోచర్)లో పేర్కొన్న వసతులు కల్పించలేదన్న కారణంగా పరిహారం కోరజాలరని, ఒప్పందంలో లేనిపక్షంలో వాటికి చట్టబద్ధత లేదంటూ తీర్పు వెలువరించింది. సికింద్రాబాద్‌కు చెందిన కేఆర్‌వీ కుమార్ కూకట్‌పల్లిలోని ఇమామి కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన స్వర్ణలేక్ ప్రాజెక్ట్‌లో రూ.48.14 లక్షలకు ఫ్లాట్ కొనుగోలు చేసి 2011 జూన్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. 2012 డిసెంబరులోగా ఫ్లాట్ అప్పగించాల్సి ఉంది. సకాలంలో అప్పగించలేదని, పైగా నిర్మాణంలో లోపాలున్నాయని, టైల్స్, తలుపులు తదితరాలు నాసిరకంగా ఉన్నాయని.. వీటన్నింటికీ రూ.28.73 లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ కుమార్ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.
దీనిపై కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్, సభ్యురాలు టి.మీనా రామనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నిర్మాణదారు సమాధానమిస్తూ అనుమతుల ప్రకారమే నిర్మాణం చేపట్టామని, జీహెచ్‌ఎంసీ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ప్రకారం ఫ్లాట్‌ను 2016లో అప్పగించామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. ఫిర్యాదుదారు టైల్స్, తలుపులు, ఇతర నిర్మాణాల్లో లోపాలున్నాయని అంటున్నప్పటికీ ఫొటోలు తప్ప ఎలాంటి ఆధారాలు సమర్పించలేదంది. తిరిగి రంగులు వేసుకున్నందుకు ఖర్చయిందన్నారని, స్వాధీనం చేసుకున్నాక ఎలా వేసుకున్నారన్నది ప్రశ్నార్థకమంది. కరపత్రంలో పేర్కొన్న రాక్ క్లైంబింగ్, జాగింగ్ ట్రాక్, వ్యాయామశాల, సీసీ టీవీలు, లైబ్రరీ తదితరాలన్నీ ఒప్పందంలో లేవని.. వాటికి చట్టబద్ధత లేదని పేర్కొంది. ఒప్పందం ప్రకారం చెల్లించిన కారు పార్కింగ్ మొత్తాన్ని, ఇతర నిర్వహణ ఛార్జీలను తిరిగివ్వాలన్న అభ్యర్థనలనూ తోసిపుచ్చింది. నిర్మాణంలో జాప్యం జరిగితే చదరపు అడుగుకు రూ.5 చొప్పున చెల్లిస్తామని ఒప్పందంలో ఉందని, దీని ప్రకారం రూ.3.50 లక్షలు, ఖర్చుల కింద రూ.10 వేలు ఫిర్యాదుదారుకు చెల్లించాలని ఇమామి కన్‌స్ట్రక్షన్స్‌ను ఆదేశిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి: కరోనా వేళ.. వలస కూలీలకు ఏదీ భరోసా?