TSPSC Group 1: గ్రూప్-1 దరఖాస్తుల గడువు ముగిసింది. గతంతో పోలిస్తే భారీగా దరఖాస్తులు అందాయి. 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు. రాష్ట్రావిర్భావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రోజుకు సుమారు పది వేల చొప్పున దరఖాస్తులు అందగా.. గత నెల 31న ఒక్క రోజే దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేశారు. గడువు పెంచిన తర్వాత.. చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తులు సమర్పించారు.
పరీక్ష తేదీలపై ఉత్కంఠ..
దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో.. పరీక్ష తేదీలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రిలిమ్స్‌పై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. జులై చివరి వారం.. లేదా ఆగస్టులో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావించినప్పటికీ.. పలువురు అభ్యర్థుల నుంచి అందిన వినతులపై సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో బ్యాంకింగ్, రైల్వే పరీక్షలు, ఆగస్టులో కానిస్టేబుల్, ఎస్సై నియామక పరీక్షలు, సెప్టెంబరులో సివిల్స్ మెయిన్స్ ఉన్నందున.. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని షెడ్యూలు ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
సవరణకు స్పందన అంతంత మాత్రమే..
మరోవైపు వన్ టైం రిజిస్ట్రేషన్ సవరణకు స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రాత్రి 12 గంటల వరకు కొత్తగా లక్షా 95 వేల 179 మంది ఓటీఆర్ నమోదు చేసుకోగా.. గతంలో చేసుకున్న వారు జోనల్ వ్యవస్థకు అనుగుణంగా 3 లక్షల 92 వేల 156 మంది సవరించుకున్నారు. మొత్తం కలిపి సుమారు 5 లక్షల 87 వేల 335 మంది ఓటీఆర్‌లు సిద్ధంగా ఉండగా.. అందులో 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి..