CWC Approves Gudem Lift Irrigation Project : గోదావరి పరీవాహకంలోని గూడెం ఎత్తిపోతల, మోడికుంట వాగు ప్రాజెక్టులకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. ఆ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన దిల్లీ శ్రమశక్తి భవన్లో సమావేశమైన కమిటీ ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. ఈ భేటీకి రాష్ట్రం నుంచి నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీలు, ఇంజినీర్లు హాజరయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన గూడెం ఎత్తిపోతల పథకం కింద 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 2008 సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టుకు రూ.118 కోట్లతో అనుమతులు ఇవ్వగా.. తెలంగాణ ఏర్పడ్డాక ఆ అంచనాలు రూ.180 కోట్ల వరకు పెరిగాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ప్రస్తుత ములుగు జిల్లా పరిధిలో ఉన్న మోడికుంట వాగు నిల్వ సామర్థ్యం 0.04 టీఎంసీలు. వాజేడు మండలంలో 5 వేల 500 హెక్టార్ల ఆయకట్టు సాగులోకి రానుంది. సీతారామ బ్యారేజీకి ఎగువన ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి గోదావరిలో కలిసే వాగుపై దాదాపు రూ.500 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఆనకట్ట నుంచి పై భాగంతో పాటు 15 శాతం ఆయకట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండగా.. మిగిలిన ఆయకట్టు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. దీని ఆధునికీకరణకు 2017-18లో రూ.78 కోట్ల వరకు వ్యయం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం అది దాదాపు రూ.100 కోట్ల వరకు చేరుకోవచ్చని అంచనా. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు 15:85 నిష్పత్తిలో నిధులు కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. ఈ రెండు ప్రాజెక్టులను గోదావరి నదీ యాజమాన్య బోర్డు అజెండాలో పెట్టగా.. తాజాగా కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపింది.
కేటీఆర్ బహిరంగ లేఖ..: ఇదిలా ఉండగా.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రప్రభుత్వం రెండో దశ పర్యావరణ అనుమతులు నిరాకరించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బహిరంగ లేఖ రాశారు.
ఇదేం న్యాయం?
అన్ని హామీలు ఇచ్చిన తెలంగాణ.
అయినప్పటికీ...
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి నిరాకరణ!
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఆది నుంచీ తెలంగాణపై కక్ష
మన రాష్ట్ర ప్రాజెక్టులపై అంతులేని వివక్ష.
అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టు
సాగు, తాగు నీటి ప్రాజెక్టుల కోసం కేంద్ర నిధులు ఇవ్వరు.
మేమే కట్టుకుంటాం అంటే అనుమతులివ్వరు
కృష్ణా జలాలపై 500 టీఎంసీ తెలంగాణ హక్కుల సంగతి తేల్చరు
అడుగడుగునా కొర్రీలు.. అంతులేని వేధింపులు అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ఇవీ చూడండి..
పగిలిన గూడెం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్... నీటి పాలైన 200 ఎకరాలు