రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై విత్తన కంపెనీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో విత్తన కంపెనీలతో సమావేశమైన సీఎస్ అందుకు అవసరమైన విత్తనాల లభ్యతపై చర్చించారు. యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. 36 విత్తన కంపెనీలతో సమావేశమైనట్లు సీఎస్ వివరించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రేపు జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమావేశం కానున్నట్లు తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలైన అపరాలు, నూనెగింజల సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని కంపెనీల ప్రతినిధులను కోరారు. వేరుశనగ, పెసలు, మినుములు, శనగలు, నువ్వులు, ఆముదము, సజ్జలు, నూనెగింజలు తెలంగాణలో యాసంగిలో సాగుకు అనుకూలమైనవిగా ఆయన పేర్కొన్నారు. కలెక్టర్లతోపాటు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎస్ వెల్లడించారు.
రాష్ట్రంలోని 2,603 రైతువేదికల ద్వారా 27, 28, 29 తేదీలలో రైతులకు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి యం.రఘునందన్ రావు, వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్.వి.ప్రవీణ్ రావు, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి, హకా ఎండీ యాదిరెడ్డి, టీఎస్ సీడ్స్ ఎండీ కేశవులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
CS somesh kumar Review: 'ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిశీలనపై స్పెషల్ ఫోకస్'