అడవుల పునరుజ్జీవంతో పాటు ఆక్రమణల నుంచి కాపాడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో 129 ప్రాంతాల్లోని 188 ఫారెస్ట్ బ్లాక్‌లకు సంబంధించిన లక్షా 60వేల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు. అర్బన్ ఫారెస్ట్‌లపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
మొక్కల ప్రభావం స్పష్టంగా కనిపించేలా...
హైదరాబాద్‌లో ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించేలా... మొక్కలు నాటేందుకు వీలున్న ప్రతి చోటా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీలో సమగ్ర రహదార్ల నిర్వహణ కింద చేపడుతున్న రోడ్లకు ఇరువైపులా, స్మశాన వాటికలు, పాఠశాలలు, చెరువులు, డ్రైనేజీ కాల్వల వెంట పెద్దఎత్తున మొక్కలు నాటాలన్న సీఎస్... నాటిన మొక్కల ప్రభావం స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రూ. 900 కోట్ల కంపా నిధులతో...
హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, హెచ్ఎంఆర్ఎల్, అటవీశాఖ ద్వారా అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లలో వెంటనే మొక్కలు నాటాలని చెప్పారు. కంపా నిధుల కింద అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల అభివృద్ధికి రూ.900 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం కంపా కింద ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఆర్డీఓ, డీఎఫ్ఓ, సంబంధిత ఏజెన్సీలతో కమిటీలు ఏర్పాటు చేసి ఫారెస్ట్ బ్లాక్‌ల భూ సమస్యలను వారంలోపు పరిష్కరించాలన్నారు. నాటే మొక్కల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించనున్నట్లు సీఎస్ తెలిపారు.
ఇదీ చూడండి: 'వడ్డీ వసూలు చేస్తే మారటోరియంతో ప్రయోజనమేంటి?'