అటవీ భూములను ఆక్రమణల నుంచి కాపాడటం ప్రభుత్వానికి సవాల్‌గా మారిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఎస్కే జోషి అన్నారు. అటవీశాఖలో దేశ వ్యాప్తంగా తీసుకుంటున్న వినూత్న కార్యక్రమాలు, ఆవిష్కరణలపై హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తెలంగాణకు హరితహారంపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను సీఎస్ ఆవిష్కరించారు. అటవీ, రెవెన్యూ భూముల కచ్చితమైన సరిహద్దుల గుర్తింపుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని సీఎస్ అన్నారు. తెలంగాణలో అటవీ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కలప, ఫర్నిచర్ తయారీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని.. అడవులపై ఒత్తిడి తగ్గించే మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఆటవీశాఖలో అమలు చేస్తున్న కొత్త ప్రయత్నాలు, ఆవిష్కరణలు ఈ వర్క్ షాప్ ద్వారా పరస్పరం పంచుకోవచ్చని సీఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అటవీ సంరక్షణ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: చంచల్‌గూడ జైలుకు నౌహీరా షేక్