రాష్ట్రంలో నేటి నుంచి రెండో విడత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. 50 వేల లోపు రుణాలను నేటి నుంచి మాఫీ చేయనున్నారు. దీంతో 6,06,811 మంది రైతులకు 2005.85 కోట్ల రూపాయల మేర లబ్ధి జరగనుంది. మాఫీ మొత్తాన్ని ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
ఆధార్, రేషన్ కార్డులతో అర్హుల లెక్క
రుణమాఫీ రెండోవిడతకు రైతుల కుటుంబాల లెక్కల సేకరణ పూర్తయింది. అర్హుల వివరాలను నిర్ధరించుకునేందుకు రేషన్‌కార్డు, ఆధార్‌ను అనుసంధానించి ఆన్‌లైన్‌లో పోల్చి చూస్తున్నారు. కుటుంబం మొత్తానికి కలిపి రూ.లక్ష వరకూ రుణమాఫీ చేయాలనే నిబంధన ఉంది. వీరిలో రూ.25 వేల నుంచి రూ. 50 వేల వరకూ బాకీ ఉన్న 6,06,811 మంది రైతుల రుణాల ఖాతాలకు ఈ నెల 16 నుంచి 30 వరకూ వ్యవసాయశాఖ నిధులు జమ చేయనుంది. వాస్తవానికి వీరి సంఖ్య 10 లక్షల వరకూ ఉన్నట్లు తొలుత భావించారు. కానీ కుటుంబం వారీగా ఆన్‌లైన్‌లో పోలిస్తే వారి సంఖ్య 6.06 లక్షలకు పరిమితమైంది. కొందరు రైతులు వేర్వేరు ప్రాంతాల్లో... నాలుగైదు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఇలాంటి వాటిని వడపోసి రూ.25 వేలు - రూ.50 వేల మధ్య ఉన్నవారి పేర్లు, ఒక్కో కుటుంబానికి 2018 డిసెంబరు 11 నాటికి ఎంత బాకీ ఉందనే వివరాలను తయారు చేశారు. గత ఏడాది రుణమాఫీ తొలి విడతలో రూ.25 వేల లోపు బాకీ ఉన్న రైతులు 6 లక్షల మంది వరకూ ఉంటారన్న గణాంకాల మేరకు ప్రభుత్వం 2020 జూన్‌లో తొలుత రూ.1200 కోట్లు విడుదల చేసింది. కానీ రేషన్‌కార్డు, ఆధార్ సంఖ్యలను పోలిస్తే చివరికి అర్హులైన వారు 2.96 లక్షల మంది మాత్రమేనని తేలింది. వారి రుణఖాతాలకు రూ.408.38 కోట్లు వ్యవసాయశాఖ జమ చేసింది.
రోజుకు రూ.వెయ్యి పెంచుతూ...
రుణమాఫీ నిధుల విడుదలకు ఈసారి కొత్త విధానం అమలు చేస్తున్నారు. సోమవారం తొలిరోజున రూ.25 వేలు- రూ. 26 వేల మధ్య బాకీ ఉన్న రైతుల ఖాతాలకు నిధులు జమ చేస్తారు. రెండోరోజు రూ.26 వేల నుంచి రూ. 27 వేలు, మూడోరోజు రూ.28 వేలు ఇలా రోజుకు రూ.వెయ్యి చొప్పున పెంచుతూ ఈ నెల 30కల్లా మొత్తం రూ.50 వేల లోపు బాకీలన్నింటికీ నిధులు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ.2005.85 కోట్లను ప్రభుత్వం వ్యవసాయశాఖకు ఇప్పటికే విడుదల చేసిందన్నారు. నిధుల జమకు ఆదివారం ఆన్‌లైన్‌లో ట్రయల్ రన్ కింద రూ.25 వేల నుంచి రూ.25,100 వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో సొమ్ము వేశామన్నారు.
ఇదీ చూడండి: Independence Day: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు