Koonanneni Sambasivarao on fire on PM Modi: దేశంలో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా 'బీజేపీ కో హఠావ్.. దేశ్ కో బచావ్' పేరిట దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్ మగ్ధూం భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, భాగం హేమంతరావు తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల 14 నుంచి నెల రోజుల రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 'ఇంటింటికి సీపీఐ' పేరిట కార్యక్రమం చేపడతామని చెప్పారు. అన్ని జిల్లాలోని ప్రతి గ్రామాల్లో ప్రజలకు వద్దకు వెళ్లి మోదీ నాయకత్వంలో పలు రంగాల్లో జరుగుతున్న అన్యాయం, సమైఖ్యత, సమగ్రతకు వాటిల్లుతున్న ముప్పును ప్రజలకు వివరిస్తామని కూనంనేని స్పష్టం చేశారు.
దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించిన ఆయన.. ప్రశ్నిస్తున్న విపక్ష నేతలపై ఈడీ, అక్రమ కేసులు బనాయించి కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దారుణమని దుయ్యబట్టారు. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో సొంత బలంతో అధికారంలో ఉన్న బీజేపీ 2024 ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. మే 14న కొత్తగూడెంలో లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఏప్రిల్ 9న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీపీఐ, సీపీఐ(ఎం) తొలి సంయుక్త రాష్ట్రస్థాయి సమావేశం జరగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి సీపీఐ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను విడుదల చేశారు.
"ఈనెల 14 నుంచి రాష్ట్రంలో ఇంటింటికి సీపీఐ కార్యక్రమం ఉంటుంది. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బీజేపీ కో హఠావో దేశ్ బచావో పేరిట ఉద్యమం చేపట్టబోతున్నాం. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో సొంత బలంతో అధికారంలో ఉన్న బీజేపీ 2024లో ఓటమి తప్పదు. మే 14 భద్రాద్రి కొత్తగూడెంలో లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తున్నాం. అంతే కాకుండా ఈనెల 9న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీపీఐ, సీపీఐ(ఎం)ల తొలి ఉమ్మడి సంయుక్త రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం".- కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి:
'బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో అన్ని సీట్లకు మించి గెలవలేదు'
అలా చేస్తేనే టీఆర్ఎస్కు మద్దతు కొనసాగిస్తాం : కూనంనేని
ఎంపీపీగా ఉదయం అధికారిక కార్యక్రమాల్లో.. కూలీగా మధ్యాహ్నం పొలం పనుల్లో..