ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. కేంద్రం కార్పొరేట్ అనుకూల విధానాలకు ఈ నిర్ణయం ఓ పరాకాష్ఠ అని మండిపడ్డారు. కేంద్రం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయడంతో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం 32 బ్యాంకులను 12 బ్యాంకుల్లో విలీనం చేయడం అతిపెద్ద తప్పని అన్నారు. ప్రైవేటీకరణకు నిర్ణయంతో పేద, గ్రామీణ ప్రజలకు శరాఘాతం లాంటిదన్నారు. గతంలో ప్రైవేట్ బ్యాంకులు దివాలా తీసి వినియోగదారులకు కుచ్చుటోపి పెట్టాయని.. డిపాజిట్ దారులకు ఇప్పటిదాకా డబ్బులు రాలేదన్నారు. బ్యాంకులను జాతీయం చేయడంతో రైతులకు, మధ్య, పేద తరగతి వర్గాలకు లాభం జరిగిందని తెలిపారు. అందువల్లే గ్రామీణ భారతానికి బ్యాంకింగ్ సేవలు విస్తరించాయని పేర్కొన్నారు.
గతంలో 2006-07లో అమెరికన్ సబ్‌ప్రైమ్ కుంభకోణంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైతే.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం తట్టుకుని నిలబడిందని వెల్లడించారు. అందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు, సంస్థలే కారణమని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పిన విషయాలను ఆయన గుర్తు చేశారు. దేశంలో ఎందరో ఆర్థికవేత్తలు, మేధావులు బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంటే మోదీ ప్రభుత్వం ముందుకెళ్లడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు.