CPI Chada Venkat Reddy Letter to CM KCR : జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెలకు అవార్డులు రావడంలో కీలక పాత్ర పోషించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని లేఖలో పేర్కొన్నారు. నాలుగేళ్ల ప్రొబేషనల్ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. ఇప్పటి వరకు వారి ఉద్యోగాలు క్రమబద్దీకరించకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. కొంతమంది విధి నిర్వహణలో మృతి చెందారని.. ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా జూనియర్ పంజాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించేందుకు జీవోను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చి.. రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర అధికంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వారు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్.. చరిత్రను వక్రీకరిస్తోంది..: మరోవైపు.. గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోందని చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాక ముందే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు.
కానీ ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వమే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసిందని చెప్పి.. స్థానిక ఎమ్మెల్యేను మరో సారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ మాట్లాడటం చరిత్రను వక్రీకరించినట్టే అవుతుందన్నారు. సీపీఐ లేనిదే గౌరవెల్లి ప్రాజెక్టు లేదని, ప్రభుత్వం వరద కాలువ పూర్తికి రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న హుస్నాబాద్‌లో జరగనున్న సీపీఐ భారీ బహిరంగ సభను పార్టీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి: