కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో టీకా అందండంలేదు. వ్యాక్సిన్ కొరత కారణంగా టీకాకేంద్రాలకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారంతా... తమకు కేటాయించిన విధంగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో టీకా లభించక... అధికారులతో గొడవకు దిగే పరిస్థితి నెలకొంది.
ఆందోళనకు దిగారు..
హైదరాబాద్ మన్సూరాబాద్ ఆరోగ్య కేంద్రంలో టీకా పంపిణీపై ప్రజలు ఆందోళనకు దిగారు. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకున్న వారందరూ ఉదయం 9గంటల వరకు ఆస్పత్రి వద్ద బారులు తీరారు. తమ వద్ద ఉన్న నిల్వలతో కేవలం 60 మందికి మాత్రమే ఇవ్వగలమని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న 30మందికి.... క్యూలైన్‌లో నిల్చున్న మరో 30 మందికి మాత్రమే ఇవ్వగలమని తెలిపారు. తమ చేతుల్లో ఏం లేదని... ప్రభుత్వం అందించిన విధంగానే తాము టీకా వేస్తున్నట్లు చెప్పారు. దీంతో క్యూలైన్లలో నిల్చున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఆన్‌లైన్ బుక్‌చేసుకుని, తెల్లవారుజామున ఆస్పత్రి వద్దకు చేరుకున్నా... గంటలతరబడిగా నిరీక్షించినా టీకా ఇవ్వటంలేదని వాపోయారు.
మొదటి డోసుకు నో ఎంట్రీ
మేడ్చల్ జిల్లా షాపూర్‌నగర్ పీహెచ్‌సీలో కేవలం రెండో డోసు వారికే టీకా వేస్తున్నారు. టీకాల కొరతతో మొదటి డోసు వేయట్లేదని బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదే పీహెచ్‌సీలో కిట్ల కొరతతో కరోనా పరీక్షలు సైతం నిలిచిపోయాయి. కిట్లు లేక టెస్టులు చేయటంలేదని అధికారులు చెప్పారు.
సౌకర్యాలు లేక
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల, ఆరుట్ల, ఎలిమినేడు, దండుమైలారం, మాడ్గుల ఆస్పత్రుల వద్ద టీకా, వ్యాక్సినేషన్‌లకు వచ్చిన వారు బారులు తీరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఉదయం వచ్చి.. 9 గంటల నుంచి లైన్లలో నిల్చున్నారు. 11 గంటల వరకు టీకా వేస్తామని సమయం ఇచ్చినా ప్రారంభించకపోవటంతో... తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆస్పత్రి వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో గంటల తరబడిగా ఎండలో నిల్చున్నారు. వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
వ్యాక్సినేషన్ కేంద్రాల మూసివేత
జగిత్యాల జిల్లాలో కరోనా టీకా కొరత కారణంగా... చాలా కేంద్రాలను అధికారులు మూసివేశారు. కొన్ని సెంటర్లలో మాత్రం వ్యాక్సిన్ వేస్తుండటంతో... ఆయా చోట్ల పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. జిల్లావ్యాప్తంగా జగిత్యాలతో పాటు కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, వెల్గటూర్, అంబారీపేట సెంటర్లలో మాత్రమే వాక్సిన్ వేస్తున్నారు. జగిత్యాల జిల్లా ఆస్పత్రికి ఉదయం నుంచి గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. గంటల తరబడి లైన్లలో వేచిచూసినా టీకా ఇవ్వకపోవటంతో... చేసేదిలేక చెప్పులు వరసలో పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
కరోనా వ్యాపిస్తే..
వందలాది మంది ఒకే దగ్గరికి చేరటంతో... కరోనా వ్యాప్తికి ఆస్పత్రులే కేంద్రాలుగా మారే ప్రమాదముందని ఇక్కడికి వచ్చినవారు వాపోతున్నారు. టీకాలతో పాటు కరోనా రాపిడ్ టెస్టులు కూడా అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు కేవలం 50 కిట్‌లు మాత్రమే వస్తుండడంతో... వందలాది మంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు 10వేల కిట్‌లు అవసరముండగా... కేవలం 16వందలు మాత్రమే వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 7,994 కరోనా కేసులు