కొవిడ్ కారణంగా మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు యాభై వేల రూపాయల పరిహారం చెల్లింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించింది. ఇందుకోసం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు యాభై వేల రూపాయలు పరిహారంగా అందించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది.
మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు
కరోనాతో మృతి చెందినట్లు అధికారిక ధృవపత్రం, ఇతర డాక్యుమెంట్లతో రాష్ట్రంలోని 4,500 మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. దరఖాస్తుతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర అవసరమయ్యే డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుందని తెలిపింది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్‌లు సభ్యులుగా ఉండే కొవిడ్ మరణాల నిర్ధరణ కమిటీ అధికారిక ధృవీకరణ పత్రం జారీ చేయనుంది.
కుటుంబసభ్యుల ఖాతాల్లో జమ
ఆ తర్వాత పరిహారాన్ని మరణించిన వారి సమీప కుటుంబసభ్యులు లేదా బంధువుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వివత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఇతర వివరాల కోసం మీసేవా ఫోన్ నెంబర్ 040-48560012 కు లేదా meesevasupport@telangana.gov.in అనే మెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించింది.