ETV Bharat / state

కరెంటు ఉద్యోగుల కాసుల కక్కుర్తి.. పని ఏదైనా పైసలివ్వాల్సిందే..! - Corruption in electricity

విద్యుత్‌ సంస్థల్లో అవినీతి బాగోతాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. ఏ పని కావాలన్నా పైసలివ్వందే కావడం లేదు. ఏ పని అడిగినా కొందరు విద్యుత్‌ సిబ్బందికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంలో సొంత ఉద్యోగులకు సైతం వేధింపులు తప్పడం లేదు. హైదరాబాద్‌లో కొందరు డీఈల సంపాదన రూ.కోట్లలో ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి.

Corruption in electricity department
కరెంటు ఉద్యోగుల కాసుల కక్కుర్తి
author img

By

Published : Mar 26, 2022, 4:45 AM IST

ఏ చిన్నపని చేయాలన్నా ప్రజల నుంచే కాకుండా తమ కింద పనిచేసే చిరుద్యోగుల నుంచీ లంచాలు తీసుకోవడం కొందరు అధికారులకు మామూలైపోయింది. విద్యుత్‌ సంస్థల్లో అవినీతి బాగోతాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో మీటరు బిగించాలన్నా, వీధిలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుచేయాలన్నా, అది కాలితే మార్చాలన్నా, పొలాల్లో కాలిన ట్రాన్స్‌ఫార్మర్‌ తరలించాలన్నా, మరొకటి ఏర్పాటుచేయాలన్నా, విద్యుత్‌ స్తంభాలు కొత్తవి వేయాలన్నా, పాడైన లైన్లను మార్చాలన్నా...ఇలా ఏ పని అడిగినా కొందరు విద్యుత్‌ సిబ్బందికి లంచాలు ఇవ్వాల్సిందే. నగరాలు, పట్టణాల పక్కనే రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తే విద్యుత్‌ లైన్లు ఇవ్వడానికి కొందరు రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. వీలైతే ప్లాటు కూడా రాయించుకుంటున్నారు. హైదరాబాద్‌లో కొందరు డీఈల సంపాదన రూ.కోట్లలో ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి.

అంతా ఆన్‌లైన్‌ సేవలు..అయినా వసూళ్లే...

విద్యుత్‌ సంస్థలలో ఏ పనులు చేయించుకోవాలన్నా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది.కానీ క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సిబ్బంది కదలిరావాలంటే ఎంతోకొంత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు.- ఒక భవనంలో 5కు మించి కరెంటు కనెక్షన్లు ఉంటే అక్కడ తప్పనిసరిగా ప్యానల్‌బోర్డు ఏర్పాటుచేయాలి. అందుకు ఏకంగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల దాకా లంచాలు వసూలు చేస్తున్నారు. కొన్ని పెద్ద పెద్ద భవనాల్లో 40 నుంచి 100కి పైగా కరెంటు కనెక్షన్లు, మీటర్లు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి బేరం తగిలితే ఇక పండగే అన్నట్లుగా పనిచేస్తున్నారు.

* రైతు పొలంలో బోరు వేసుకుని కొత్త వ్యవసాయ కనెక్షన్‌కు దరఖాస్తు చేస్తే రూ.70 వేల దాకా డిస్కం సొంతంగా ఖర్చుపెడుతోంది. కానీ బోరువరకు స్తంభాలు వేయాలన్నా, లైను లాగాలన్నా, కనెక్షన్‌ ఇవ్వాలన్నా రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.
* గ్రామీణ పేదలు, వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉన్న ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో లంచాల వసూళ్లు అధికంగా ఉండటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లలో ఉత్తర డిస్కం పరిధిలో ముగ్గురు లైన్‌మెన్‌లు, ముగ్గురు ఏఈలు, ఒక డీఈఈ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం ఉన్న దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో రూ.లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు.
* కొందరు ఉద్యోగులే బినామీ పేర్లతో తాము పనిచేస్తున్న సంస్థల్లో కాంట్రాక్టు పనులు చేసుకుంటూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. వారిపై గుత్తేదారులు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
* ఇంజినీర్ల అవినీతిని అలుసుగా తీసుకుని గ్రామస్థాయిలో ఉండే లైన్‌మెన్‌లు కూడా స్థానిక నిరుద్యోగులకు రోజూవారీ డబ్బులు చెల్లిస్తూ తమ పనులను వారితో చేయిస్తున్నారు.
* విద్యుత్‌ ఉద్యోగులు సొంత వ్యాపారాలు, లంచాలు తీసుకోవడంలో బిజీగా ఉంటున్నారని ప్రశ్నిస్తే వారి తరఫున సంఘాల నాయకులు, ఇతర నేతలు అడ్డుకుంటున్నారని సీనియర్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’తో ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 50 వేల మందికి పైగా ఉద్యోగులుండగా విద్యుత్‌ ఉద్యోగ సంఘాలే 40కి పైగా ఉండటం గమనార్హం.

చీఫ్‌ ఇంజినీరు... అయినా వసూళ్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ విద్యుత్కేంద్రంలో చీఫ్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న అధికారికి నెలజీతం, ఇతర భత్యాలన్నీ కలిపి నెలకు రూ.3 లక్షలకుపైగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ జెన్‌కో చెల్లిస్తోంది. విద్యుత్కేంద్రంలో ఏటా మరమ్మతు పనులను గుత్తేదారులతో చేయించడం ఆనవాయితీ. ఈ పనులు చేసేవారి నుంచి రూ.10 వేల లంచం డిమాండు చేయడంతో కడుపు మండి అవినీతి నిరోధక శాఖకు చెప్పి పట్టించారు. ఆయనను జెన్‌కో సస్పెండ్‌ చేసింది. ఓ నాయకుడు గట్టిగా ఒత్తిడి తేవడంతో వేరేచోట అదే హోదాలో తిరిగి పోస్టింగు పొందారు.

రూ.వందకోట్ల ఆస్తులు...చిరుద్యోగి నుంచి లంచం

మిర్యాలగూడలో విద్యుత్‌ డివిజనల్‌ ఇంజినీరు (డీఈ) పలు కాంట్రాక్టు పనులను బినామీ పేర్లతో చేయిస్తూ రూ.100 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలింది. అయినా ధనదాహం తీరక చివరికి తన కింద పనిచేసే చిరుద్యోగి నుంచి రూ.2 లక్షల లంచం వసూలు చేస్తూ ఏసీబీ వలకు చిక్కాడు. మరో ఇద్దరు ఉద్యోగులతో కలసి పంచుకోవడానికి ఈ డబ్బులు వసూలు చేయడం గమనార్హం. ఈ డీఈ అందుకుంటున్న జీతభత్యాలు నెలకు రూ.2 లక్షలపై మాటే.

రూ.2 లక్షల బిల్లుకు రూ.20 వేల లంచం...

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి విద్యుత్‌ డీఈకి నెలకు రూ.రెండు లక్షల దాకా జీతభత్యాలు అందుతాయి. విద్యుత్‌ లైన్ల నిర్మాణ కాంట్రాక్టు పనులు చేస్తున్నందుకు గుత్తేదారుకు రూ.2 లక్షల బిల్లు చెల్లించడానికి సంతకం పెట్టాలంటే 10 శాతం కింద రూ.20 వేల లంచం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు.గుత్తేదారు రూ.18 వేలు ఇచ్చి ఏసీబీకి పట్టించడంతో అవినీతి బయటపడింది.

* గ్రేటర్‌ హైదరాబాద్‌లో సైబర్‌సిటీ, గచ్చిబౌలి, వరంగల్‌, కరీంనగర్‌ వంటి నగరాల్లో ఖరీదైన ప్రాంతాల్లో ఏఈ, డీఈఈ వంటి పోస్టింగ్‌ కోసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా లంచాలు ఇవ్వడానికి వెనుకాడటం లేదంటే వారు ఏ స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

కఠిన చర్యలు తీసుకుంటున్నాం

-జి.రఘుమారెడ్డి, సీఎండీ, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ

విద్యుత్‌ సంస్థల్లో 50 వేల మందికి పైగా ఉద్యోగులుంటే కొందరి అవినీతి వల్ల చెడ్డపేరు వస్తోంది. లంచాలు వసూలు చేసినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. సస్పెండ్‌ చేస్తున్నాం. చాలామంది ఉద్యోగులు కష్టపడి పనిచేయడం వల్లనే నిరంతర విద్యుత్‌ సరఫరా చేయగలుగుతున్నాం. అవినీతికి పాల్పడినవారు ఏ స్థాయిలో ఉన్నా వదిలేది లేదు. ఎవరైనా లంచాలు అడిగితే తక్షణం ఏసీబీకి ఫిర్యాదు చేసి వారిని పట్టించాలని ప్రజలను కోరుతున్నాం.

విద్యుత్‌ సంస్థలకు చెడ్డపేరు తేవద్దు

-జి.సాయిబాబు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల 1104 సంఘం

తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏడేళ్లలోనే విద్యుత్‌ ఉద్యోగుల జీతభత్యాలను 70 శాతానికి పైగా అదనంగా పెంచారు. ప్రజలకు సేవలు చేయడానికి ప్రభుత్వం నెలనెలా రూ.లక్షల కొద్దీ జీతాలిస్తున్నా లంచాలకు కక్కుర్తి పడి విద్యుత్‌ సంస్థలకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు. లంచం తీసుకుంటే ఏం కాదులే అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.