ఏడు సముద్రాల ఆవల ఉన్నా ఏటా రాఖీ పండగకి సోదరులను కలవాలనేది అక్కాచెల్లెళ్ల ఆశ. ఇప్పుడు ‘అన్నను చేరలేం.. తమ్ముడిని చూడలేం..ఎవరి ఇంట్లో వాళ్లు బందీలవ్వాల్సిన పరిస్థితి’ అంటూ పలువురు వాపోతున్నారు. ఊహ తెలిసిన నుంచి అన్నదమ్ముల బాగు కోరి కట్టే రక్షాబంధనం ఈ ఏడాది చాలామందికి దూరమైంది. వైరస్ వల్ల సోదరులను, సోదరిలను కోల్పోయిన వారూ ఉన్నారు. ఇంకొందరు క్వారంటైన్‌లో ఉండి తోబుట్టువులను చేరలేక బాధపడుతున్నారు.
నేను వారి దగ్గరికి వెళ్లలేను
నాకు ఇద్దరు అన్నలు. వివాహమై కన్నవారిళ్లు విడిచి వచ్చినా ఇక్కడ కూడా వారే నా బలం. ఊహ తెలిసినప్పటి నుంచీ ఇప్పటివరకు ప్రతి రాఖీ పండగకి తప్పకుండా వారికి రక్ష కట్టేదాన్ని. ఈసారి ఆ అవకాశం లేదు. 14 రోజుల క్రితం మా మామ కరోనాతో చనిపోయారు. నేనూ కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. సోదరులు మలక్‌పేటలో ఉంటారు. అక్కడి వరకు వెళ్లలేను.. వారు నా దగ్గరికి వచ్చి వెళ్లే పరిస్థితి లేదు. రక్షాబంధన్ రోజు గుర్తొస్తేనే ఏడుపొస్తోంది. మా జీవితంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
- ఓ సోదరి.
నలభై ఏళ్ల బంధం దూరమైంది
నేను నలభై ఏళ్లుగా మా అన్నయ్యకి రాఖీ కడుతున్నాను. ప్రతి ఏటా ఎక్కడున్నా ఈరోజు తప్పకుండా కలిసేవాళ్లం. ఎంత ఇబ్బందికర పరిస్థితులున్నా తనకి కట్టి వచ్చేదాన్ని. ఇప్పుడు ఆ అవకాశం లేకపోయింది. ఇక ఎప్పుడూ రాదు. ఎందుకుంటే కరోనా మహమ్మారి వల్ల అన్నయ్య చనిపోయారు. ఉన్న ఒక్క సోదరుడినీ అది దూరం చేసింది.
-మహిళ, రాణిగంజ్
ఇవీ చూడండి: ఆరు ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేస్తాం: ఈటల