గ్రేటర్ వ్యాప్తంగా కరోనా ఘంటికలు మోగుతున్నాయి. బుధవారం మరో 108 మంది వైరస్ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, మేడ్చల్ జిల్లాలో మరో ఇద్దరు పాజిటివ్‌లుగా తేలారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఏడుగురు మృతి చెందారు. మరో 15 మంది పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. రోగులకు సేవలందించే వైద్యులు కొవిడ్-19 బారిన పడగా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మానియా వైద్య కళాశాలలో మంగళవారం 12 మంది పీజీ వైద్య విద్యార్థులకు వైరస్ సోకిన సంగతి తెలిసిందే. బుధవారం మరో 13 మందికి నిర్ధారణ అయినట్లు సమాచారం ఉన్నా అధికారికంగా నిర్ధారించలేదు. ఇంకా పలువురు విద్యార్థుల పరీక్ష నివేదికలు రావాల్సి ఉంది.
మరో వైపు నిమ్స్‌లోనూ కరోనా కలకలం రేపుతోంది. వైద్యుల రక్షణకు పీపీఈ కిట్లు, ఎన్95 మాస్క్‌లు అందించాలని జూనియర్ వైద్యులు కోరుతున్నారు. ఓ జర్నలిస్టుతో పాటు ఆయన భార్య ఇద్దరు కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడ్డారు. కింగ్‌కోఠి ఆసుపత్రిలో ఆరుగురు పారిశుద్ధ్య, కాపలా సిబ్బందికి కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం.
కొత్త ప్రాంతాలకు విస్తరణ
జియాగూడ, ఆసిఫ్‌నగర్, కార్వాన్, భోలక్‌పూర్ ప్రాంతాల్లో కేసులు కొనసాగుతుండగా, తాజాగా వైరస్ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. నాగోల్ డివిజన్ బండ్లగూడ, ఫత్తుల్లాగూడలో కొత్తగా కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లోనూ బాధితులు పెరుగుతున్నారు. లాక్డౌన్ సడలింపులు నేపథ్యంలో అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగుతున్నాయి. నగరం నుంచి శివార్లకు ప్రజలు వెళుతున్నారు.. వస్తున్నారు. ఇదే వైరస్ వ్యాప్తికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలో పర్వేద, రావులపల్లి కలాన్‌లో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో తాజాగా 28 మంది అనుమానితులు చేరారు. వీరు విద్యానగర్, నల్లకుంట, అంబర్‌పేట, రామాంతపూర్, నాగారం, ఎల్బీనగర్, గుడి మాల్కాపూర్ చెందిన వారు. కరోనా కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.