Telangana Congress Party Joinings : రాష్ట్ర కాంగ్రెస్‌లో సామాజిక వర్గాల వారీగా గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగుతోంది. జనాభా ప్రాతిపదికన కాకపోయినా కొంచెం అటుఇటుగా అభ్యర్ధులు ఎంపిక ఉండేటట్లు ముందుకు వెళ్లాలని పీసీసీ నిర్ణయించింది. అధికారమే ధ్యేయంగా అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్న పీసీసీ జన,ధనబలం కలిగిన నాయకుల కోసం ఆరా తీస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ముందే అభ్యర్ధులను ప్రకటిస్తామన్న కాంగ్రెస్ సామాజిక వర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. సామాజిక వర్గాల వారీగా బీసీలు 48, జనరల్ 23, ఎస్సీలు 17, ఎస్టీలు 11 శాతం లెక్కన జనాభా ఉంది. ఎస్సీలకు 18, ఎస్టీలకు 9 లెక్కన మొత్తం 27 రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా సీట్ల కేటాయింపు పరిశీలిస్తే బీఆర్ఎస్ ఓసీలకు 58, బీసీ లకు 27, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, మైనార్టీలకు 3 లెక్కన సీట్లు కేటాయించారు.
Congress Searching Strong Candidates : కాంగ్రెస్ పొత్తుల్లో 19 స్థానాలు కోల్పోగా....మిగిలిన వందలో ఓసీలకు 41, బీసీలకు 25, ఎస్సీలకు 17, ఎస్టీలకు 10, మైనారిటీలకు 7 లెక్కన అసెంబ్లీ సీట్లు కేటాయించారు. బీజేపీ 119 స్థానాల్లో పోటీచేయగా ఓసీలకు 50, బీసీలకు 33, ఎస్సీలకు 21, ఎస్టీలకు 12, మైనారిటీలకు మూడు లెక్కన కేటాయించింది. మొత్తంగా తక్కువ శాతం జనాభా కలిగిన ఓసీలు ఎక్కువ స్థానాల్లో బరిలో నిలుస్తున్నారని స్పష్టమవుతోంది. రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని గెలిచే సత్తా ఉన్నవారిని బరిలో దించుతున్నాయి.
దాదాపు 50 శాతం జనాభా కలిగిన బీసీలకు ఆ స్థాయిలో సీట్లు కేటాయించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. 2018లో 25 మంది బీసీలను బరిలో దింపగా ఈసారి అంతకంటే ఎక్కువ సంఖ్యలో పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార భారాస అభ్యర్ధులను దీటుగా ఎదుర్కొనగలిగే సత్తా ఉన్న బీసీనేతల కోసం పీసీసీ వేట కొనసాగుతోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది. ఆ పార్టీలో చేరేందుకు పలువురు నాయకులు ఆసక్తిచూపిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నఅభ్యర్ధులను పరిశీలించిన పీసీసీ చాలాచోట్ల బీసీ అభ్యర్ధులు బలహీనంగా ఉన్నట్లు అంచనా వేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి పార్టీలో చేరేందుకు వచ్చే వారిలో బలమైన నేతలు ఉంటే వారికి అవకాశం కల్పించాలని భావిస్తోంది.
ప్రధానంగా బీసీల్లో జన,ధనబలం కలిగి ప్రత్యర్థి పార్టీలను దీటుగా ఎదుర్కొని గెలవగలిగే వారినే గెలుపు గుర్రాలుగా కాంగ్రెస్ భావిస్తోంది. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ సీట్ల కేటాయింపులో వివాదాలకు తావులేకుండా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శుల పర్యవేక్షణలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
Ponguleti, Jupally To Join Congress : త్వరలో రాహుల్ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలతోపాటు 15 నుంచి 20 మంది వరకు చేరనున్నారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ చేరికల ప్రక్రియ మొదలయ్యాక మరికొంత మంది నాయకులు కాంగ్రెస్‌లోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీలో చేరే నాయకుల సత్తా, సర్వేల ఆధారంగా టికెట్లు ఉంటాయని పీసీసీ స్పష్టం చేస్తోంది.
ఇవీ చదవండి: