Congress Rythu Rachabanda: వరంగల్ రైతు డిక్లరేషన్ అంశాలను జనంలోకి తీసుకెళ్లేందుకు ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ రచ్చబండ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామ గ్రామానికి గడప గడపకు రైతు డిక్లరేషన్ అంశాలను తీసుకెళ్లేందుకు దాదాపు 400 మంది నాయకులు భాగస్వామ్యం అవుతున్నారు. నియోజక వర్గాలవారీగా పని విభజన చేసుకుని నెల రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గడపలకు ఆ డిక్లరేషన్ చేరేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున కరపత్రాలు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు లాంటివి రచ్చబండ సమయంలో పంపిణీ చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో చేసిన డిక్లరేషన్ వందకి వంద శాతం అధికారం కట్టబెడితే అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. అందులో భాగంగా పలువురు సీనియర్ నాయకులు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభింస్తారు.
ఇవాళ్టి నుంచి నెల రోజులపాటు కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం కొనసాగనుంది. వరంగల్ రైతు డిక్లరేషన్ అంశాలను పీసీసీ నిర్దేశించినట్లు నెల రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అందులో భాగంగా ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదునూరు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జనగాం అసెంబ్లీ నియోజకవర్గం కొమురవల్లి గ్రామం రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, హుజూర్‌నగర్‌లోని చింతలపాలెం మండలం బుగ్గ మాదారం గ్రామంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగిత్యాల మండలం పొలాస గ్రామంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గంలో న్యాల్కల్ మండల కేంద్రంలో వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి, కామారెడ్డి గ్రామీణ మండలంలోని గూడెం గ్రామంలో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డి, కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని నగునూరు గ్రామంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు పాల్గొంటారు.
ఇవీ చదవండి: