కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, చిన్నారెడ్డి, సునీతారావు, భారీ స్థాయిలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, జీఎస్టీ పెంపు, నిరుద్యోగం, అగ్నిపథ్‌పై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు చేపట్టారు.
ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ‘‘8 ఏళ్లలో భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ధరలు ఇష్టారాజ్యంగా పెంచింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తోంది. పిల్లలు తాగే పాలు, బిస్కెట్లపైనా మోదీ సర్కారు పన్నులు వేస్తోంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అనారోగ్యంతో ఉన్నా ఈడీ విచారణ పేరుతో వేధిస్తోంది. ఈడీని జేబు సంస్థగా మార్చేసి ప్రశ్నించే గొంతులను మూసేందుకు ప్రయత్నిస్తోంది. భాజపా దేశానికి చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలన్న ఆ పార్టీ ఆశలపై నీళ్లు చల్లాల్సిందే. మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామగ్రామాన రచ్చబండల్లో విస్తృత చర్చ జరగాలి’’ అని పార్టీ శ్రేణులకు సీతక్క పిలుపునిచ్చారు.
మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి: ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్
‘‘మోదీ సర్కారు అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. స్వరాష్ట్రం తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత సోనియా గాంధీది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కలిసి ఈడీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దిల్లీలో పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ముందుకు తీసుకెళ్లాలి. రాబోయే రోజుల్లో మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి’’ అని నదీమ్ అన్నారు.
ఇవీ చూడండి.. 'దేశంలో ఆ ఇద్దరి 'నియంత' పాలన.. ప్రశ్నిస్తే దాడులే!'
Secunderabad Protest Case : సికింద్రాబాద్ ఘటనలో వాట్సాప్ సంభాషణలే కీలకం