కొత్త భవనాల పేరుతో ప్రజల డబ్బు వృథా చేసి శిలా ఫలకాలపై తన పేరు పెట్టుకోవాలనే తపన తప్ప ప్రజల సమస్యలు తీర్చే ఆలోచన కేసీఆర్కు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు మండిపడ్డారు. 'నీకు కొత్త కొత్త ఆలోచనలొస్తాయ్' అంటూ వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. ఆదివాసీలు సాగుచేస్తున్న అడవి భూములకు హక్కు పత్రాలు జారీ చేయాలని, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్, తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ విభాగం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దీక్షలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
భూమి లేని పేద వారికి భూములిస్తానని చెప్పి ఇవ్వకపోగా, వారి భూములనూ తీసుకుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎనిమిది వేల ఎకరాల అటవీ భూమిని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని, ఆదివాసీలపై అక్రమ కేసులు పెట్టించారని ఎల్పీహెచ్ఎస్ జాతీయ అధ్యక్షుడు బెల్లయ్యనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల వారి ఓట్లు కావాలి కానీ వారికి జరుగుతున్న అన్యాయం పట్టించుకోరని నేతలు విమర్శించారు. అడవులలో ఉండేవారు అడవులను నరికి వేస్తున్నారని అనడం సరి కాదన్నారు. కేంద్ర అటవీ హక్కుల చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం అమలుకై ఆందోళనలు నిర్వహిస్తామని.. ఆగస్టు 9న దిల్లీలో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.
ఇదీ చూడండి : గొర్రెల పెంపకం పథకంపై హైకోర్టులో వ్యాజ్యం