జీహెచ్ఎంసీకి సంబంధించిన రోడ్డును కొంత మంది వ్యక్తులు కబ్జా చేయడం ఖైరతాబాద్‌లోని నెహ్రూ నగర్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అప్పటి ప్రభుత్వం రాజీవ్ గృహ కల్ప పథకంలో భాగంగా ఇళ్లు కేటాయించిందని మంజుల అనే మహిళ తెలిపింది. ఆ ఇళ్లను కే ముత్యాలు, లలిత దంపతులు కబ్జా చేశారని ఆరోపించింది. గత 15 ఏళ్లుగా వారు తమ ఇంట్లో అక్రమంగా నివాసం ఉంటున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఇంటి వెనుక భాగంలో తలుపు ఏర్పాటు చేసి రోడ్డు కబ్జా చేసి మరో నూతన గదిని నిర్మించేందుకు యత్నించారని తెలిపింది. దీనిపై నిలదీసినందుకు తమపై దాడి చేయడం సహా అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్డు కబ్జా చేయడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. పురపాలక, రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది.
ఇదీ చూడండి : రాయితీపై ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తామని..బోర్డు తిప్పేసిన సంస్థ