MLA Sayanna funeral: సికింద్రాబాద్ మారేడుపల్లి శ్మశానవాటికలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.సాయన్న అంత్యక్రియలు ఎట్టకేలకు ముగిశాయి. ఎమ్మెల్యే అంత్యక్రియలు నిర్వహిస్తుండగా... శ్మశానవాటిక వద్ద ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అనుచరులు ఆందోళనకు దిగారు. సాయన్న అంత్యక్రియలను అభిమానులు అడ్డుకొని... అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నినాదాలు చేశారు.
ఈ విషయంపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పోలీసు అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. మంత్రి తలసాని శ్మశానవాటిక నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంటే మంత్రి మల్లారెడ్డి సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక మరోవైపు శ్మశానవాటికకు భారీగా సాయన్న అభిమానులు చేరుకుని.. ఆందోళన చేశారు.
శ్మశానవాటిక వద్దకు నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి చేరుకుని.. అధికారికంగా నిర్వహించడంపై ప్రభుత్వ ఉత్తర్వులు లేవని తెలిపారు. ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యులతో మాట్లాడిన పోలీసులు.. అధికారిక లాంఛనాల ఉత్తర్వులకు సమయం పడుతుందని వివరించారు. అంత్యక్రియలకు ఆలస్యం అవుతుందని తెలిపారు. దీనితో అంత్యక్రియలకు సహకరించాలని కార్యకర్తలను కుటుంబ సభ్యులు కోరారు. వారు ఆందోళన విరమించడంతో సాయన్న అంత్యక్రియలు పూర్తి చేశారు.
అంతకుముందు ఇవాళ ఉదయం ఇవాళ సాయన్న భౌతికకాయాన్ని కార్ఖానాకు తరలించారు. ప్రజలు, అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం క్యాంప్ కార్యాలయంలో భౌతికకాయాన్ని ఉంచారు. ఇక మధ్యాహ్నం అంతిమయాత్రగా తీసుకొచ్చి.. మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
71 సంవత్సరాల సాయన్న.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఈనెల 16న కుటుంబసభ్యులు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆదివారం హార్ట్ అటాక్ రావడంతో కన్నుమూశారు. గతంలో సాయన్నకు గుండె ఆపరేషన్ కూడా జరిగింది.
ఇవీ చదవండి: