రాష్ట్రంలో రైతులందరికీ సరపడా యూరియాను తక్షణమే సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు అందించే విషయంపై ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమై యూరియా స్థితిగతులను తెలుసుకున్నారు. ఎప్పుడూ లేనంతగా యూరియాకి ఇంత డిమాండ్ ఏర్పడడానికి గల కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రత్యక్ష నగదు బదిలీ, ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో ఎరువుల అవసరం రావడం, నౌకల రవాణా కారణంగా ఇబ్బందులు ఏర్పడినట్లు అధికారులు వివరించారు. వివిధ కంపెనీల ద్వారా వచ్చిన సుమారు లక్షా 15 వేల టన్నుల యూరియ విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం, న్యూమంగుళూరు నౌకాశ్రయాల్లో ఉందని తెలిపారు.
25 గూడ్స్ రైళ్లు ఏర్పాటు
పోర్టుల్లో ఉన్న యూరియాను తక్షణమే తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే అధికారులతో మాట్లాడిన సీఎం 25 గూడ్స్ రైళ్లు కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వేశాఖ అధికారులు వెంటనే గూడ్సు రైళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వీటి ద్వారా నౌకాశ్రయాల్లో ఉన్న నిల్వలు జిల్లాలకు తరలించేందుకు ఒక్కో పోర్టుకు ఒక్కో వ్యవసాయాధికారిని పంపాలని సీఎం ఆదేశించారు. యూరియా చేరగానే లారీలు సిద్ధం చేసి గ్రామాల వారీగా పంపిణీ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి , ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మకు సూచించారు. యూరియా స్టాక్‌ను ఎక్కడా పెట్టకుండా నేరుగా గ్రామాలకు తీసుకెళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు.
మూడు నాలుగు రోజుల్లో కేవలం రైళ్ల ద్వారానే 60 వేల టన్నులకు పైగా యూరియా వస్తుందని సీఎం తెలిపారు. దీనిని ప్రగతి భవన్‌లోనే ఉండి పర్యవేక్షించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. ఇక్కడి నుంచే ఏపీ మంత్రులతో, రైల్వే అధికారులతో, లారీ యజమానులతో కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. సమస్య పూర్తిగా తొలగిపోయే వరకు ఎవరూ అలసత్వం వహించొద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఇదీ చూడండి: యూరియా కొరతపై వ్యవసాయ మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం