తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై ఈ నెల ఆరో తేదీన అత్యున్నత మండలి సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు 14 పేజీల లేఖ రాసిన సీఎం... తాను లేవనెత్తుతున్న అంశాలను సమావేశ ఎజెండాలో చేర్చాలని కోరారు. ఏడు అంశాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో చేర్చాలని కోరిన ఆయన... తెలంగాణ డిమాండ్లను అందులో ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయాన్ని సవరించాలని కోరారు. సాగునీటిలో తెలంగాణకు అన్యాయం జరిగిందని బచావత్ ట్రైబ్యుబల్ చెప్పినా న్యాయం చేయకపోవడం బాధకరమన్నారు. ఏడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వ నిర్లిప్తత వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానిని కోరినా ఫలితం లేదు
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాల్సి ఉందని.. ఎన్ని జలాలు వస్తాయో తెలుసుకునేందుకు రాష్ట్రం ఇంకా నిరీక్షిస్తోందని వ్యాఖ్యానించారు. నది జలాల్లో తెలంగాణకు కేటాయింపులు చేయాలని పలుమార్లు ప్రధానిని కోరినా ఫలితం లేదన్నారు. హక్కుగా రావాల్సిన వాటా తేల్చకుండా ఎందుకు అన్యాయం చేస్తున్నారో కారణం తెలియాలన్న ముఖ్యమంత్రి... నిర్ధిష్ట గడవులోగా ఈ అంశాన్ని పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులతో పాటు కొత్తగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏకంగా 179 టీఎంసీల నీటిని తరలించారు
కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలించే ఈ అక్రమ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేవన్నారు. చెన్నైకి తాగునీటిని సరఫరా చేసేందుకు కేవలం 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు అనుమతిస్తే... తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకుండా 44000 క్యూసెక్కులకు పెంచారని అన్నారు. కృష్ణా బేసిన్ అవతలకు నీటిని తీసుకెళ్లేందుకు ఇప్పుడు ఏకంగా 80000 క్యూసెక్కులకు పెంచుతున్నారని లేఖ ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న 44వేల క్యూసెక్కుల సామర్థ్యంతోనే 2019-20లో పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ అవతలకు ఏకంగా 179 టీఎంసీల నీటిని తరలించారని సీఎం పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడితే తెలంగాణ ప్రాజెక్టులకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు చుక్క నీరుండదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా నది యాజమాన్య బోర్డు విఫలం
ఈ పరిస్థితుల్లో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకొని పనులు ఆపేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశించాలని కోరారు. వ్యవస్థగా ఉండాల్సిన కృష్ణా నది యాజమాన్య బోర్డు పర్యవేక్షణ పూర్తి అసమర్థంగా ఉందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు, రాయలసీమ ఎత్తిపోతల అంశం, టెలిమెట్రీల ఏర్పాటు తదితరాల్లో కృష్ణానది యాజమాన్య బోర్డు పర్యవేక్షణ సరిగా లేదన్నారు. పీఆర్పీ నుంచి అక్రమంగా నీటిని తరలిస్తోంటే మౌనంగా ఉన్న బోర్డు... శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా నీటి విడుదల ఆపాలని లేఖ రాయడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణను కూడా తెలంగాణకే అప్పగించాలని కోరారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు నీటి కేటాయింపులు చేసేందుకు విభజనచట్టం మూడో సెక్షన్ కింద ట్రైబ్యునల్ కు విధివిధానాలు ఇవ్వాలని కోరితే కేంద్రం ఇప్పటికీ స్పందించలేదన్నారు.
ఏపీ అభ్యంతరాలు పూర్తిగా అసంబద్ధమైనవని
గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ఏడు ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు పూర్తిగా అసంబద్ధమైనవని ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టి, డిజైన్లు రూపొందించి.. ప్రారంభించినవని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం వరకే అనుమతులు, భూసేకరణతో పాటు 15 నుంచి 20 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని చెప్పారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా వాటిని రీడిజైన్ చేశామన్న సీఎం... కేటాయింపులకు లోబడే ఉన్న ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను చేపట్టామన్న కేసీఆర్... 2019 జూన్ 21న ఏపీ సీఎం జగన్, అప్పటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ప్రాజెక్టు ప్రారంభించే నాటికే మూడో టీఎంసీ పనులు కూడా 95శాతం పూర్తయ్యాయని తెలిపారు.
పరివాహక ప్రాంతం 80 శాతం ఉంటే నీటికేటాయింపులు 65 శాతమే
కేవలం పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల నుంచి దృష్టి మళ్లించేందుకే ఆంధ్రప్రదేశ్ ఈ పనులపై అభ్యంతరం చెబుతోందని కేసీఆర్ ఆరోపించారు. గోదావరిలో అందుబాటులో ఉన్న 1486 టీఎంసీల్లో 967 తెలంగాణకు, 518 ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు కేటాయించినట్లు 2014 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటన చేశారని తెలిపారు. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం 80 శాతం ఉంటే నీటికేటాయింపులు 65 శాతం చేశారని అన్నారు. గోదావరి ట్రైబ్యునల్ అవార్డు వివరాలను కూడా లేఖలో పొందుపర్చిన ముఖ్యమంత్రి... ప్రతి ఏటా కనీసం 3000 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తోందని అన్నారు.
967 బదులు 1950 టీఎంసీలు కేటాయించాలి
తెలంగాణకు అదనపు జలాలను కేటాయించాల్సిన అవసరం ఉందని... 967కు బదులు 1950 టీఎంసీలు కేటాయించాలని కోరారు. కోటికిపైగా జనాభా, 30 నుంచి 40 లక్షల వలస కార్మికులు ఉండే హైదరాబాద్ నగర అవసరాల కోసం అదనపు జలాలు కావాలని... ఐటీ, ఫార్మా పరిశ్రమల విస్తరణతో పాటు పెరుగుతున్న పట్టణకీరణ అవసరాలను తీర్చాల్సి ఉందని చెప్పారు. వీటన్నింటి నేపథ్యంలో తాను లేవనెత్తిన అంశాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశ ఎజెండాలో చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు.
ఇదీ చదవండి: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వార్నర్‌సేన విజయం