CM KCR Speech at Telangana Assembly Sessions 2023 : గురువారం ప్రారంభమైన శాసనసభ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. సమావేశాల్లో చివరి రోజైన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం - సొంత రాష్ట్రంలో సాధించిన ప్రగతి అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. అలాగే ఎమ్మెల్యేలు లేవనెత్తిన పలు అంశాలపై కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
CM KCR on Telangana Development : ప్రజల తలసరి ఆదాయం ఆధారంగా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తలసరి ఆదాయం విషయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఏపీ కంటే తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రూ.లక్ష ఎక్కువగా ఉందన్న కేసీఆర్.. ఎన్నాళ్లుగానో ముందువరుసలో ఉన్న తమిళనాడు, గుజరాత్ కంటే మెరుగ్గా ఉన్నామని తెలిపారు. 1956లో ప్రజలు వ్యతిరేకిస్తున్నా లెక్కచేయకుండా ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేశారన్నారు. విలీన సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తుంటే చూస్తూ కూర్చున్నది ఎవరని ప్రశ్నించారు. అనేక ఒప్పందాలను కాలరాసినా కాంగ్రెస్ నేతలు ప్రేక్షక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
'1969 ఉద్యమంలో ఎందరో విద్యార్థుల ప్రాణాలు పోయాయి. 1969 తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ ఉక్కుపాదంతో అణచివేసింది. ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతుంటే చూస్తుకూర్చున్నారు. తెలంగాణ అన్న పదాన్నే వాడకూడదని ఆనాటి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు జై తెలంగాణ అనటం.. మంత్రి పదవి ఇవ్వగానే దుకాణం మూసేయటం జరిగేది. కాంగ్రెస్ నేతల వైఖరి వల్ల తెలంగాణ ఉద్యమంపై ప్రజల్లో నమ్మకం పోయేది. అప్పుడు 5 నెలలపాటు చర్చలు చేసి తెలంగాణ ఉద్యమానికి కార్యాచరణ రూపొందించాను. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చాకే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చింది.'-సీఎం కేసీఆర్
తెలంగాణ కోసం 38 పార్టీల మద్దతు కూడగట్టాను : తెలంగాణలో పోలింగ్ సమయంలో ముగియగానే వైఎస్‌ఆర్ మాట మార్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఇస్తే హైదరాబాద్ వెళ్లేందుకు ఆంధ్ర ప్రజలకు వీసా కావాలని వైఎస్‌ఆర్ రెచ్చగొట్టారన్న సీఎం.. సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణను ఎన్నోసార్లు అవమానించారన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని సీఎం అంటే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు నేరెత్తలేదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3 కొత్త రాష్ట్రాలు చేసినప్పుడు తెలంగాణను విస్మరించారన్నారు. హైదరాబాద్ తెలంగాణలోనే ఉండగా.. ప్రత్యేక తెలంగాణ ఎందుకని బీజేపీ నేత అన్నారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ఎన్నో రకాలుగా నష్టపోయిందన్న సీఎం.. తెలంగాణ కోసం పార్లమెంటులో 38 పార్టీల మద్దతు కూడగట్టానని పేర్కొన్నారు. పార్లమెంటులో 38 పార్టీలు గొంతెత్తడంతో కాంగ్రెస్ దిగివచ్చిందన్నారు. ప్రకటించిన తెలంగాణపై వెనక్కు తగ్గడంతో వందల మంది ప్రాణాలు పోయాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
'అన్నీ ఉచితంగా ఇస్తున్నామని తెలంగాణను బీజేపీ విమర్శించింది. అదే బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో ఎన్నో ఉచితాల హామీలు ప్రకటించిందిసమయం వచ్చినప్పుడు మేం కూడా పింఛన్లు పెంచుతాం. రాబోయే రోజుల్లో ఎన్ని పథకాల నిధులు పెంచాలో అన్నీ పెంచుతాం. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4 వేలు పింఛను ఇవ్వట్లేదు. రూ.4 వేల పింఛను ఛత్తీస్‌గఢ్‌లో ఇవ్వని కాంగ్రెస్ తెలంగాణలో ఎలా ఇస్తారు. దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగస్తులకు పేస్కేల్ ఇస్తాం. అతి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తాం. ఉద్యోగస్తులు కూడా మా పిల్లలే, వాళ్లను బాగా చూసుకుంటాం. ఆర్థిక వనరులు సమకూరగానే మళ్లీ జీతాలు పెంచుతాం. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.47 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రపంచమంతా ప్రభావం చూపేలా హైదరాబాద్ స్థిరాస్తి రంగం పెరుగుతోంది. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి స్థిరాస్తి కంపెనీలు వస్తున్నాయి.'-ముఖ్యమంత్రి కేసీఆర్
మా అస్త్రాలు తీసినప్పుడు విపక్షాలు గాలిలో కొట్టుకుపోతాయి : పాదయాత్రలో నాయకుడికి ప్రజలు సమస్యలు చెప్పుకోవటం సహజమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఓ ప్రవచనకారుడిలా భట్టి విక్రమార్క తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం 58 ఏళ్లు సాగటానికి కారణం ఎవరని ప్రశ్నించిన సీఎం.. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది జవహర్‌ల్ నెహ్రూ కాదా నిలదీశారు. అలవికాని హామీలను తము ఎప్పుడూ ఇవ్వమన్న సీఎం.. తమ అమ్ముల పొదిలోనూ చాలా అస్త్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాము అస్త్రాలు తీసినప్పుడు విపక్షాలు గాలిలో కొట్టుకుపోతాయన్నారు.
Governor Approves TSRTC Bill : ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం