రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడుతూ ప్రణాళికాబద్ధ అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇందుకోసం ఆర్థికసంఘం నిధులతో పాటు బడ్జెట్ నుంచి కూడా ప్రతి నెలా నిధులు క్రమం తప్పకుండా ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలను ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో అమలు తీరుపై పూర్తి స్థాయి సమగ్ర సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్న సీఎం.. చేరుకోవాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయని అన్నారు. పంచాయతీ రాజ్ అధికారులు, అదనపు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పురోగతిని, అధికారుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ నెల 19 నుంచి ఆకస్మిక తనిఖీలు చేపడతానని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఇవాళ కీలక సమీక్ష ఏర్పాటు చేశారు.
ప్రగతిభవన్ లో జరగనున్న సమీక్షకు జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు హాజరు కావాలని సమాచారం ఇచ్చారు. జిల్లాల వారీగా కార్యక్రమాల అమలు, పనుల పురోగతిపై సీఎం క్షుణ్ణంగా సమీక్ష నిర్వహిస్తారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, అనుభవాలు, ఇబ్బందులను తెలుసుకుంటారు. అదనపు కలెక్టర్లు, డీపీఓల పనితీరుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆకస్మిక తనిఖీ కోసం చార్ట్ తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. గ్రామాలు, మండలాల వారీగా చార్ట్‌ల రూపకల్పన, విధివిధానాలపై కూడా సమీక్షలో సీఎం స్పష్టం చేయనున్నారు. పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా, పచ్చగా ఉంచేలా ప్రజలను ఇంకా భాగస్వామ్యం చేసే విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేస్తారు.
ఇదీ చూడండి: prathidwani: పర్యటకరంగంపై కరోనా పంజా.. మళ్లీ కోలుకునేదెలా.?