భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr review) అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో (cs somesh kumar) సమీక్షించారు. గులాబ్ తూపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్ సాయం తీసుకోండి..
రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. జిల్లాల్లో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, నీటి పారుదల, అగ్నిమాపక శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అవసరమైతే... హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌ల్లో ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.
ముంపు ప్రాంతాలపై దృష్టిపెట్టండి..
ప్రతీ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు సమాచారం సచివాలయంలోని కంట్రోల్ రూంకు అందించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులు, బ్రిడ్జీల వద్ద కూడా ప్రత్యేకంగా అధికారులను నియమించడం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను క్షుణ్ణంగా సమీక్షించాలని స్పష్టం చేశారు.
మరోవైపు, జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పని చేయాలని పోలీస్ కమిషనర్లు, ఎస్‌పీలను ఆదేశించామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్ అధికారులతో కూడా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు డీజీపీ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: TS Police on Rains: ఇళ్లలోనే ఉండండి... అత్యవసరమైతే 100కి కాల్ చేయండి