జలవనరుల శాఖ నూతన స్వరూపం కొత్త ఏడాది నుంచి అమలు కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో శాఖ పునర్వ్యవస్థీకరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం జలవనరుల శాఖను 19 ప్రాదేశిక విభాగాలుగా విభజించారు. కొత్త స్వరూపానికి అనుగుణంగా అవసరమయ్యే 945 అదనపు పోస్టులను మంజూరు చేశారు. దీంతో ఏడాదికి ఖాజానాపై 60 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా. వివిధ స్థాయిల్లోని ఇంజనీర్ల పనులు మంజూరు చేసే మొత్తాన్ని కూడా పెంచారు. ఈఎన్సీ జనరల్ కోటి రూపాయల విలువైన పనుల వరకు గరిష్టంగా ఏడాదికి 25 కోట్ల వరకు పనులు మంజూరు చేయవచ్చు. ఇతర ఈఎన్సీలు, సీఈలకు 50 లక్షల రూపాయల వరకు గరిష్టంగా ఏడాదికి ఐదు కోట్ల వరకు... ఎస్ఈలకు 25 లక్షల వరకు గరిష్టంగా ఏడాదికి రెండు కోట్ల రూపాయల వరకు అధికారం ఉంటుంది. ఈఈలు ఐదు లక్షల వరకు గరిష్టంగా సంవత్సరానికి 25 లక్షల వరకు పనులు మంజూరు చేయవచ్చు. డీఈఈలకు రెండు లక్షల వరకు, ఏడాదికి ఐదు లక్షల వరకు పనులు మంజూరు చేసే అధికారం ఉంటుంది. ఈ పనులకు ఏడాదికి 280 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు.
దశలవారీగా నియామకాలు
ఏఈఈలు, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అవసరాన్ని బట్టి దశల వారీగా నియామకాలు చేపడతారు. కార్యాలయాల ఏర్పాటు, ఫర్నిచర్, ఇతర అవసరాల కోసం 320 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు కోసం మరో 3.2 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేశారు. డ్యాంలు, ఆనకట్టలు, పంప్‌హౌస్‌ల వద్ద అవసరమయ్యే 4236 మంది భర్తీకి కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో 532 వర్క్ ఇన్స్పెక్టర్, 109 ఎలక్ట్రిషియన్, తదితర స్కిల్డ్ పోస్టులను రెగ్యులర్ పద్ధతిన నియమించుకునేందుకు అనుమతి ఇచ్చారు. 2874 లష్కర్ సహా ఇతర సిబ్బందిని పొరుగుసేవల విధానంలో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అర్హతలను బట్టి ఆయా జిల్లాలోని నిర్వాసిత కుటుంబాల వారితో నింపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణను ఇకనుంచి జలవనరుల శాఖే నేరుగా చేపడుతుంది.
ఇదీ చూడండి: కేసీఆర్ కీలక నిర్ణయం... జలవనరుల శాఖకు కొత్త స్వరూపం