Trs Meeting with KCR: ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కీలక భేటి జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది. మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్రంపై పోరులో భవిష్యత్తు కార్యచరణపై పార్టీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందంటున్న తెరాస ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహరచన చేస్తోంది.
ధాన్యం కొనుగోళ్లపై ఆందోళనలు
ధాన్యం కొనుగోళ్లపై మోదీ సర్కార్ తీరుకు నిరసనగా ఇప్పటికే నియోజకవర్గాల్లో ఆందోళనలు చేయడంతోపాటు. ఇందిరాపార్కు వద్ద ధర్నాలో స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ తెరాస ఎంపీలు నిరసన గళం విప్పారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయిన కేసీఆర్ కేంద్రంపై పోరాటానికి కలిసి కేసీారావాలని కోరారు. వీటన్నింటి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం, రాష్ట్రంలో భాజపా తీరుపై మరింత ఉద్ధృతంగా ఉద్యమించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ శ్రేణులందరినీ భాగస్వామ్యం చేసే దిశగా.... తెరాస కసరత్తు చేస్తోంది. మరోవైపు దళితబంధు సహా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రతిపక్షాల ప్రచారం, ప్రజల్లో అనుమానాలను తిప్పికొట్టేలా కార్యకర్తలకు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
శనివారం మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఈనెల 19 నుంచి సీఎం జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం శ్రేణుల్లో స్తబ్ధత తొలగించి ఉత్సాహాన్ని నింపే ద్విముఖ వ్యూహంతో కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి: