మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, తెరాస పార్టీలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
నాయిని మృతిపట్ల మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
నాయిని మరణం తెరాస పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలుగా ప్రజల మనిషిగా ఆయన రాజకీయాల్లో, కార్మిక నేతగా పనిచేశారన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో, 2001 నుంచి మలిదశ ఉద్యమంలో వారి పాత్ర అనన్యసామాన్యమని కొనియాడారు. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం నాయని తన జీవితాన్నే త్యాగం చేశారని కొనియాడారు.
నాయిని భౌతికకాయాన్ని ఉదయం 10 గంటలకు మంత్రుల నివాస సముదాయానికి.. అనంతరం అభిమానుల సందర్శనార్థం షేక్‌పేట మహాప్రస్థానానికి తరలించనున్నారు.
ఇదీ చదవండి: బుల్లెట్ నర్సన్న కన్నుమూత.. శోకసంద్రంలో తెరాస శ్రేణులు