రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. మద్యం విచ్చలవిడిగా అమ్మకాల వల్లే అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించింది. దిశ ఘటనను పార్లమెంటులోనూ ప్రస్తావించిన కాంగ్రెస్ ఎంపీలు... తెరాస ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది. గురువారం అత్యవసరంగా సమావేశమైన కాంగ్రెస్ శాసనసభాపక్షం.. మద్యం అమ్మకాలు, మహిళలపై దాడులు, పోలీసుల పనితీరుపై ప్రధానంగా చర్చించింది.
ప్లకార్డులతో నిరసన:
దాదాపు మూడు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం ముగియగానే సీఎల్పీ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డిలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్ర, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న మద్యం, బెల్ట్ దుకాణాల వల్లే యువత పెడదారి పడుతోందని నేతలు ఆరోపించారు. తక్షణమే వీటిని మూసివేయించాలని డిమాండ్ చేశారు. దశలవారీగా పోరాటం చేయాలని నిర్ణయించారు.
గవర్నర్‌కు వినతి పత్రం..
హస్తం పార్టీ పోలీసు శాఖ పనితీరును కూడా తప్పుబట్టింది. ప్రజల కోసం పని చేయాల్సిన పోలీసులు.. తెరాస నాయకులకు అనుకూలంగా పని చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. మహిళలపై దాడులకు నిరసనగా శనివారం ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి.. గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం ఇస్తామన్నారు. దిశ హత్యోదంత నిందితులకు ఉరి శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: దిశ నిందితులకు చట్ట ప్రకారమే శిక్ష : కేటీఆర్