గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పాత పథకాలనే ప్రస్తావించారని ప్రసంగంలో ఏ మాత్రం పస లేదంటూ వ్యాఖ్యానించారు. ఆరేళ్ల నుంచి చెబుతున్న అంశాలనే మళ్లీ ప్రస్తావించారని తెలిపారు.
57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు అమలు చేయడం లేదు. ఈ ఆరేళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా అదనంగా ఇచ్చారా? మిషన్ భగీరథ నీళ్లు ఎవరికి అందుతున్నాయ్? దీనిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలి. మిషన్ భగీరథపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఏపీకి తరలించుకుపోతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు. నడిరోడ్డుపై లాయర్ దంపతును నరికి చంపితే సీఎం మాత్రం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని చెప్తున్నారు. వ్యవసాయం, రైతుల మీద ప్రభుత్వానికి ప్రేమ లేదు. నూతన వ్యవసాయ చట్టాల గురించి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై చర్చించి సభలో తీర్మానం చేయాలి.
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
కేసీఆర్ ప్రభుత్వం ఇష్టానుసారంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోందని భట్టి వ్యాఖ్యానించారు. గతంలో బడ్జెట్ సమావేశాలు 30 రోజులు జరిగేవని... ఇప్పుడు ఆరు రోజులకు కుదించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతిగా, నిబద్ధతతో సమావేశాలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: కరోనా సంక్షోభంలో తెలంగాణ వ్యూహాత్మక అడుగులు: గవర్నర్