'తామొకటి తలిస్తే దైవం వేరొకటి తలచిందన్న' చందంగా మోసపోయాం మొర్రో అంటూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే.. న్యాయం చేయాల్సిన పోలీసులే తమపై అపహరణ కేసు బనాయించి అరెస్టు చేశారంటూ బాధితులు వాపోయారు. చిట్టీల పేరుతో సుమారు రూ. 2 కోట్లకు టోకరా పెట్టి పరారైన ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న అసలు సమస్య ఇక్కడే మొదలైంది. తమ తండ్రిని అపహరించారంటూ నిందితుడి కుమారుడు బాధితులుపై కేసుపెట్టి అరెస్టు చేయించాడు.
అసలేం జరిగింది?
గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన వెంకటేశ్వరరావు గతం కొన్నేళ్లుగా నగరంలో ఉంటూ చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. కాని ఈ ఏడాది జనవరి నుంచి వారికి డబ్బులు ఇవ్వడం లేదు. చివరికి నిలదీయగా కాలం గడుపుతూ వచ్చాడని.. కొంత కాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని బాధితులు తెలిపారు.
నిందుతుడి కోసం గాలించిన బాధితులు రేపల్లె వెళ్లి అతన్ని కలిసి అతడిని నగరానికి తీసుకొచ్చారు. కాని నిందితుడు కుమారుడు మాత్రం బాధితులే తన తండ్రిని అపహరించారంటూ కేసు పెట్టి ఆరుగురుని అరెస్టు చేయించాడని బాధితులు వాపోతున్నారు. బాధితుడు కూడా తనని ఎవరూ అపహరించలేదని మీడియాకు తెలపడడాన్ని బట్టి పోలీసుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. తాము రాజీ పడతామని చెప్పినప్పటికీ పోలీసులు అరెస్టు చేశారని వాపోతున్నారు. బాధితులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నందునే వారిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: బిక్య తండాలో మహిళా అనుమానాస్పద మృతి