రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులుగా భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. 44 నుంచి 47 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో ఇబ్బందులు పడుతోన్న జనానికి ఉపశమనం కల్గించే తీపి కబురును వాతావరణ కేంద్రం అందించింది. శనివారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గడమే కాకుండా... రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
ఆ జిల్లాలకు వర్షసూచన
శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు నాగరత్న పేర్కొన్నారు.
శుక్రవారం ఇలా ఉంది
శుక్రవారం అత్యధికంగా నల్గొండ జిల్లాలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి, సూర్యాపేట 45.5, మంచిర్యాల, నిర్మల్‌లో 45.4 సూర్యతాపం నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాలు హైదరాబాద్ 42.3, జోగులాంబ గద్వాల్ 42.2 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ ప్రకటించింది.
ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'