సరస్వతీ పవర్స్ లిమిటెడ్‌కు... 50 ఏళ్లకు లీజు పొడిగింపు వ్యవహారంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించామని.. అన్నీ చట్ట ప్రకారమే జరిగాయని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. గతంలో 30 సంస్థలకు ఈ విధంగానే లీజు పొడిగించారని.. సరస్వతీ పవర్స్ లిమిటెడ్ 31వ సంస్థ అని చెప్పారు. శనివారం విజయవాడలో మాట్లాడిన ఆయన.. సరస్వతీ పవర్స్ లీజు పొడిగింపుపై... ప్రభుత్వం, గనుల శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించాయని చెప్పారు. దీనిపై న్యాయసలహా తీసుకుని, వాటి నుంచి వివరణ కోరుతూ... జూన్ 16న పరువునష్టం నోటీసులిచ్చామని అన్నారు. 15 రోజుల్లో బేషరుతుగా క్షమాపణలు చెప్పకపోతే... చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తప్పు చెయ్యనప్పుడు వార్తలు ఎందుకు వ్యతిరేకంగా రాస్తున్నారని ప్రశ్నించిన ఆయన.. అందుకే నోటీసులిచ్చినట్లు స్పష్టం చేశారు.
ఒక రాజకీయ నేత మాట్లాడిన వ్యాఖ్యల్ని ప్రచురించినందుకు గతంలో ఎప్పడూ నోటీసులివ్వలేదని ఓ విలేకరి ప్రశ్నించగా.. ఇలాంటి ఘటనలపై గతంలోనూ నోటీసులిచ్చారని, కేసులు నమోదు చేశారని.. అందుకు సంబంధించిన రికార్డులు చూపిస్తామని ద్వివేదీ బదులిచ్చారు. రాజకీయనేత వ్యాఖ్యలను ప్రసారం చేసిన ఛానళ్లు, ప్రచురితం చేసిన పత్రికలన్నింటికీ నోటీసులిచ్చారా అని ప్రశ్నించగా.. న్యాయసలహా మేరకే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇదీ చూడండి : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్