ఆత్మనిర్భర్ భారత్ సాధనకు చట్టబద్ధపాలన ఎంతో అవసరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయడ్డారు. న్యాయవ్యవస్థలో చట్టాలను మార్చడం కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని ఆయన తెలిపారు. లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నిర్వహిస్తోన్న చట్టబద్ధపాలన - సంస్కరణలు అనే అంశంపై వర్చువల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రెండో విడత జాతీయ సదస్సులో భాగంగా.. రెండో రోజైన ఆదివారం సాయంత్రం నేర విచారణ - సంస్కరణలు అనే అంశంపై వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆధునిక ప్రజాస్వామ్య అవసరాలకు అనుగుణంగా చట్టాలను మారుస్తామని ఆయన పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో యువ మేధావులు రావాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నమని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో తమిళనాడు మాజీ గవర్నర్ రాంమోహన్ రావు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి రణ్ బీర్ సింగ్, ఏపీసీఏ మాజీ డైరెక్టర్ ఎం.ఆర్.అహ్మద్ పాల్గొన్నారు.