కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతిని కలవడం వల్ల ఆమె పార్టీ వీడుతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. పార్టీ నుంచి విజయశాంతి వెళ్లిపోయే అవకాశాలున్నాయని హస్తం వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచార కమిటీ ఛైర్మన్ హోదాలో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.
ఈ విషయం తెలుసుకుని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గత రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా స్వయంగా విజయశాంతి ఇంటికెళ్లి చర్చలు జరిపినా.. ఆమె అసంతృప్తి వీడలేదు. పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. రాష్ట్రంలో ఏవైనా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రకటనలు విడుదల చేయడం తప్ప ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
పార్టీ కార్యకలాపాలు ఏవైనా ఉంటే గాంధీ భవన్ కార్యదర్శి ద్వారా సమాచారం ఇస్తున్నా ఆమె హాజరు కావడం లేదు. విజయశాంతి అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఆమెను కలిశారు. కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విజయ శాంతి భాజపాలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో కిషన్ రెడ్డి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి కలవడం వల్ల భాజపాలోకి చేరడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. భాజపా అధిష్ఠానం సూచన మేరకే ఆయన కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతిని కలిసి చర్చించారన్న వాదన వినవస్తోంది. కిషన్ రెడ్డి మర్యాదపూర్వక కలిశారని విజయశాంతి భర్త శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడని పగ తీర్చుకున్నాడు