Amith shah at New Cyber Lab: భవిష్యత్తులో సైబర్ నేరాలు అతిపెద్ద సవాల్‌గా మారబోతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. హైదరాబాద్ రామంతాపూర్‌లోని సెంట్రల్ సైబర్ ఫొరెన్సిక్ లాబోరేటరీ(సీఎఫ్‌ఎస్‌ఎల్) ఆవరణలో నేషనల్ సైబర్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ-ఎవిడెన్షియల్ పర్పస్(ఎన్‌సీఎఫ్‌ఎల్-ఈ)ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సైబర్ నేరాల రూపంలో పెనుముప్పు ఎదురవుతోందన్నారు. వీటి నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో మోదీ ప్రభుత్వం ముందుందన్నారు. దేశవ్యాప్తంగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సైబర్ ల్యాబ్ వ్యవస్థను రూపొందించడంలో నిమగ్నమైందన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఎన్‌సీఎఫ్‌ఎల్‌ఈని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరస్థులకు శిక్షలు వేయించడంలో ఈ ప్రయోగశాల దోహదం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాల్లో శిక్షల శాతాన్ని పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు.
సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌లకు దిక్సూచి: సీఎఫ్‌ఎస్‌ఎల్ దేశంలోని అన్ని సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌లకు దిక్సూచిలా వ్యవహరిస్తోంది. 2000లో ఏర్పాటైన ఈ ప్రయోగశాల దేశంలోని పలు చట్ట అమలు సంస్థలకు నాణ్యమైన సేవలందిస్తోంది. సైబర్ ఫొరెన్సిక్స్ కోసం కేంద్ర హోంమంత్రిత్వశాఖ 2016లో ఈ సంస్థను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 79ఏ ప్రకారం ‘ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’గా గుర్తింపు పొందిన తొలి సంస్థగా ఆవిర్భవించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ(సీఐఎస్) విభాగం పరిధిలో మహిళలు, పిల్లలపై సైబర్ నేరాల నియంత్రణ పథకం కింద నేషనల్ సైబర్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ(ఈ) ప్రాజెక్టును చేపట్టింది. అయిదేళ్లపాటు ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి రూ.35.51 కోట్లను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టునే అమిత్‌షా తాజాగా ప్రారంభించారు.
ప్రాజెక్టు ప్రత్యేకతలు, లక్ష్యాలు..
* సైబర్ నేరాలకు సంబంధించిన డేటా నిల్వలను మెరుగుపరచడానికి, ప్రాసెసింగ్ చేయడానికి కేంద్రీకృత రిపోజిటరీగా పనిచేసే అత్యాధునిక ఫొరెన్సిక్ స్మార్ట్ సర్వర్‌ను ఈ ల్యాబ్‌లో రూపొందించనున్నారు.
* పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించి.. సైబర్ నేర సంఘటనల దర్యాప్తును సులభతరం చేయనున్నారు.
* భవిష్యత్తులో ఈ ల్యాబ్‌కు రాష్ట్రాల ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలను అనుసంధానించడం ద్వారా ప్రత్యేక వ్యవస్థను రూపొందించనున్నారు.
* డిజిటల్ ఫొరెన్సిక్ రంగంలోని సమస్యల్ని పరిష్కరించడంతోపాటు నాణ్యమైన నివేదికల్ని అందించడానికి సెల్‌ఫోన్‌ను విశ్లేషించడం.. ఫోన్ డేటా, సిమ్, అంతర్గత స్టోరేజీని తిరిగిపొందడం.. డిజిటల్ స్టోరేజీ మీడియాను విశ్లేషించడం.. స్టోరేజీ చేసిన అన్ని రకాల డేటాను తిరిగిపొందడం.. లాంటి నాలుగు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు.
* దెబ్బతిన్న మీడియా, చిప్ టెక్నాలజీ, మాల్వేర్‌లను విశ్లేషించడంతోపాటు సోర్స్ కోడ్, డేటాబేస్‌ల నుంచి డేటాను తిరిగిపొందే పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చారు.
* డిజిటల్ క్రైమ్ సీన్ నిర్వహణ, ఆన్‌సైట్ ఇమేజింగ్ కోసం డిజిటల్ ఫొరెన్సిక్స్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టూల్స్, హార్డ్‌వేర్ ఫొరెన్సిక్ ఇమేజర్, రైట్‌బ్లాకర్స్, ట్రీజ్ టూల్స్‌తో కూడిన క్రైమ్ సీన్ వాహనాన్ని సమకూర్చారు.
* సైబర్ నేరాల దర్యాప్తు, విశ్లేషణ కోసం ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించనున్నారు.
ఇవీ చూడండి: 'తెలంగాణలో నిజాం ప్రభువును గద్దె దించేందుకు సిద్ధమవ్వండి..'
"జనగణమనలో 'సింధ్'ను తొలగించండి.. పాక్‌ను కీర్తిస్తూ పాడేదెలా?"