పంటలను నిల్వఉంచే గోదాములనే మార్కెట్లుగా మార్చే కార్యక్రమానికి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఎలక్ట్రానిక్ జాతీయ మార్కెట్’(ఈ-నామ్) పథకం కింద రాష్ట్రంలోని అన్ని గోదాములను ఆన్‌లైన్‌లో పంటలు కొనే ‘ఈ-మార్కెట్లు’గా మార్చాలన్నది లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 192 వ్యవసాయ మార్కెట్లున్నాయి. వీటిలో నిత్యం క్రయవిక్రయాలు జరిగేవి 60కి మించి లేవు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పంటల క్రయ, విక్రయాలు జరిగే ‘ఈ-మార్కెట్ల’ సంఖ్యను పెంచాలని మార్కెటింగ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్రం గత సెప్టెంబరులో ఆమోదించిన కొత్త వ్యవసాయ చట్టాలతో ఎవరైనా ఎక్కడైనా ‘ఈ-మార్కెట్’ ఏర్పాటు చేసుకుని ఈ-నామ్‌తో అనుసంధానం కావచ్చు. ప్రైవేటు కంపెనీలు, వ్యక్తులకు కూడా ఈ చట్టాలు అవకాశం కల్పించాయి. భవిష్యత్తులో కూడా ఎక్కడికక్కడ ప్రైవేటు సంస్థలు ఈ-మార్కెట్లు ఏర్పాటు చేసుకునే అవకాశముంది. ప్రస్తుతం మార్కెటింగ్‌శాఖ పరిధిలోని వ్యవసాయ మార్కెట్లు కొన్ని గ్రామాలకు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రైతులు అంతదూరం పంటను తీసుకురావాలంటే వ్యయ, ప్రయాసలు తప్పడం లేదు. దీంతో వ్యాపారులే నేరుగా గ్రామాలకు వెళ్లి పంటలను కొంటున్నారు. దీనివల్ల మార్కెట్లకు ఆదాయం తగ్గిపోతుందని మార్కెటింగ్‌శాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ సమస్యను అధిగమించడానికి ఎక్కడికక్కడ గోదాముల్లోనే ఈ-మార్కెట్ ఏర్పాట్లు చేయాలని అందులో పేర్కొన్నారు. అక్కడ కంప్యూటర్లు, ఇంటర్‌నెట్ సదుపాయం ఏర్పాటుచేసి సిబ్బందితో పంటలు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయవచ్చు. గతంలో పత్తిని మద్దతు ధరకు కొనేందుకు ‘భారత పత్తి సంస్థ’(సీసీఐ) కొన్ని గోదాముల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఇలా శాశ్వతంగా ఈ-మార్కెట్లు ఏర్పాటుచేయడం వల్ల రైతులకు ప్రయోజనమే కాకుండా,. మార్కెట్ సెస్ రూపంలో ఆదాయం వస్తుందనేది మార్కెటింగ్ శాఖ వ్యూహం.
ఆన్‌లైన్‌లో కొనుగోలు ఎప్పుడు..
ఈ-నామ్‌లో 57 మార్కెట్లు అనుసంధానమై నాలుగేళ్లయినా ఆన్‌లైన్‌లో దేశంలో ఎక్కడినుంచైనా పంటలను కొనే పూర్తిస్థాయి సదుపాయాలింకా లేవు. ఒక్క నిజామాబాద్ మార్కెట్‌లో మాత్రమే పసుపు పంటను కొంతమేర అప్పుడప్పుడు తమిళనాడు వ్యాపారులు ఆన్‌లైన్‌లో చూసి కొంటున్నారు. ఇలా అన్ని మార్కెట్లలో పంటలను ఆన్‌లైన్‌లో చూసి దేశంలో ఎవరైనా కొనేలా చేయాలనేది ఈ-నామ్ పథకం లక్ష్యం. సమీప భవిష్యత్తులో ఇలా దేశంలో ఎక్కడి నుంచైనా కొనేలా ఈ-మార్కెట్లను అభివృద్ధి చేస్తామని మార్కెటింగ్ శాఖ సంచాలకురాలు లక్ష్మీభాయి ‘ఈనాడు’కు చెప్పారు.
ఇదీ చూడండి: శభాష్ దుగ్గిరాలపాడు.. ఒక్కటంటే ఒక్క కరోనా కేసూ లేదు!