పోలీసులు.. మున్ముందు వామపక్ష తీవ్రవాదంతో పాటు సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలతో సహా అనేక సమకాలీన సవాళ్లపై పని చేయాల్సి ఉంటుందని.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా అన్నారు. అందుకు తగినట్లుగా సన్నద్ధమై.. సేవా స్ఫూర్తితో కర్తవ్యం నిర్వహించాలని కోరారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 73 ఆర్ఆర్‌కు చెందిన ఐపీఎస్ శిక్షణాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఎన్నికల ప్రక్రియను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడానికి.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతోన్న పశ్చిమ బంగా, అసోం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్‌లను పంపించాలనే నిర్ణయాన్ని అరోడా స్వాగతించారు. విధుల్లో పాల్గొనే వారికి మంచి అవగాహన ఏర్పడుతుందన్నారు. దేశంలో ఎన్నికల నిర్వాహణ సంక్లిష్టతతో కూడుకున్నదని వివరించారు.
పోలీసులకు.. ఇది వరకు కేవలం ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూసే విధుల్లోనే ఎక్కువగా పాల్గొనే అవసరం ఉండేదన్నారు అరోడా. రాబోయే రోజుల్లో నూతన సవాళ్లను స్వీకరిస్తూ పని చేయాల్సి వస్తుందని వివరించారు. దేశాన్ని సమైక్యం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి.. అసాధారణమైందని కొనియాడారు.
ఇదీ చదవండి: గాంధీ శాంతి పురస్కారాన్ని రెహ్నాకు అందించిన మోదీ