ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించడంతో... ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఆ రాష్ట్ర మంత్రులు అభినందనలు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసిన బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా... పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
వైకాపా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి... మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని ఏపీ మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, సీదిరి అప్పలరాజు అన్నారు. అన్ని ప్రాంతాలవారూ మూడు రాజధానులకు మద్దతు పలికారని గుర్తుచేశారు. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన వైకాపా అభ్యర్థులతో... ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా చప్పుళ్లు, విజయకేతన నినాదాలతో ర్యాలీ హోరెత్తింది.
ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిపక్షాలకు... ఓటుతోనే ప్రజలు జవాబిచ్చారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పుర ప్రజలు వైకాపాకే పట్టం కట్టారని... అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. పాలనా వికేంద్రీకరణ నిర్ణయానికి ఏపీ పురపాలక ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు సంపూర్ణ మద్దతిచ్చారని.... జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. ఆయన నివాసం వద్ద పార్టీ నాయకులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.
ఇవీ చదవండి: మేయర్లు, ఛైర్మన్ల పీఠాలపై ఏపీ సీఎం జగన్ కసరత్తు