హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో పూర్తి స్థాయి భద్రతకు, పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశమై.. ఇటీవల పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగర పరిధిలో ‘పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ’ అంశంపై ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. తక్షణ చర్యల్లో భాగంగా నెలరోజుల్లో ఓఆర్ఆర్ పరిధిలో సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో పోలీసు శాఖ సమన్వయంతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీచేసింది.
ఓఆర్ఆర్ పరిధిలోని ఐటీ, ఫార్మా, సర్వీస్ సెక్టార్ విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా పబ్లిక్ సేఫ్టీ మెజర్స్లో భాగంగా భద్రతా ప్రమాణాలను మరింతగా పటిష్టపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ జీవోనెం.167 పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. ఓఆర్ఆర్ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో రైల్, సౌత్ సెంట్రల్ రైల్వే, టీఎస్ ఆర్టీసీ, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్, సెంట్రల్ పవర్ డిస్కమ్, మార్కెటింగ్, ఇరిగేషన్ తదితర సంబంధిత ప్రభుత్వ శాఖలకు, విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గనిర్దేశనం చేసింది.
ఇదీ చదవండి : చిన్నారులకు వ్యాక్సినేషన్లో సత్తా చాటిన తెలంగాణ సర్కారు