Career After Intermediate Telangana : తెలంగాణలో ఇంటర్ పాసైన వారు ఆ తర్వాత ఏ కోర్సుల్లో చేరుతున్నారు..? ఎటువైపు వెళుతున్నారు..? డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) ద్వారా చేరే వారి సంఖ్య ఈసారి గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తుండంతో.. విద్యార్థుల పయనం ఎటువైపు అన్నది విద్యాశాఖకు అంతుపట్టకుండా ఉంది. కొత్త కోర్సులు, నూతన గమ్యస్థానాలను అన్వేషిస్తున్నారా..? లేక చదువు మానేస్తున్నారా..? అన్న ప్రశ్నలు వారికి ఉత్పన్నమవుతున్నాయి.
Degree Online Services Telangana : ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,65,478 మంది గత మార్చి/ఏప్రిల్‌లో పరీక్షలు రాశారు. అయితే వారిలో 2,95,550 మంది పాసయ్యారు. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ బోర్డుల వారిని తీసుకుంటే మరోఅయిదారు వేల మంది ఉంటారని అంచనా. ఇటీవల తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్ ఫలితాలు విడదల కాగా.. అందులో 19,800 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే మొత్తంగా 3.20 లక్షల మందికి మాత్రమే బీటెక్, మెడికల్, ఫార్మసీ, అగ్రికల్చర్, డిగ్రీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లోని ప్రవేశానికి అర్హులు.
దోస్త్‌కు స్పందన అంతంత మాత్రమే..: దోస్త్ ద్వారా మొదటి విడతలో 42 వేల మంది చేరగా.. రెండో విడతలో మరో 49 వేల మందికి సీట్లు వచ్చాయి. వారిలో సుమారు 34 వేల మంది ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. వారందరూ చేరినా 76 వేల మంది అయ్యారు. ఈనెల 7న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలవ్వగా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 65 వేల మంది ఉత్తీర్ణులయ్యారు.
అయితే వారిలో 90 శాతానికి పైగా మూడో విడత ద్వారా డిగ్రీలో చేరతారని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఆ ప్రకారం మరో 58 వేల మంది చేరినా మొత్తం సంఖ్య 1.34 లక్షలే అవుతోంది. ఏటా 2 లక్షల మందికి తగ్గకుండా చేరుతుంటే ఈసారి దోస్త్‌కు స్పందన నామమాత్రంగా ఉండడం చర్చనీయాంశగా అవుతోంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ కొద్ది రోజుల క్రితం జరిగిన ఉపకులపతుల సమావేశంలో దీనిపై ఆరా తీశారు. మరి మిగిలిన విద్యార్థులంతా ఎటు వైపు వెళ్తున్నారన్న దానిపై కచ్చితమైన సమాచారం లేదు.
గణాంకాల సేకరణ ఏది? : రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఐదు ప్రైవేట్ వర్సిటీల్లో సుమారు 7 వేల మంది విద్యార్థులు చేరుతున్నట్లు చెబుతున్నారు. వారు విద్యాశాఖకు ఏటా గణాంకాలు సమర్పించకపోవడం కూడా ఓ లోపమని విద్యావేత్తలు భావిస్తున్నారు. అలాగే కొన్ని వేలమంది హోటల్ మేనేజ్‌మెంట్‌లో చేరుతున్నా ప్రవేశాలకు ఒక విధానం ఉండడం లేదు. లాంగ్‌టర్మ్ కోచింగ్‌ల కోసం వెళ్లేవారు, విదేశాలకు వెళ్లేవారి సంఖ్యపై స్పష్టత లేదు.
ఫలితాలు ఇస్తున్నారు తప్ప రాష్ట్రం నుంచి ఎంత మంది.. ఏ కోర్సులో చేరారన్న గణంకాల సేకరణను విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. దానివల్ల భవిష్యత్‌లో పలు సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఆ దేశాల్లో మన విద్యార్థుల సమాచారం కోసం కన్సల్టెన్సీలపై ఆధారపడాల్సి వచ్చింది. కరోనా సమయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ఇంటర్ పాసైన వారెందరు, ఏ ఏ కోర్సుల్లో చేరారు? అన్న దానిపై ఏటా ఒక నివేదికను విడుదల చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు.
వాటిని కూడా సర్వేలో చేరుస్తాం : పాఠశాల విద్యాశాఖలో అమలవుతున్న యూడైస్(ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం) విధానంలో ప్రతి విద్యార్థికి ఒక సంఖ్య ఇచ్చి.. వారు 10వ తరగతి వరకు ఎక్కడ చేరినా దాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని ఉన్నత మండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి అన్నారు. ఆ తరహాలో ఉన్నత విద్యలో కూడా ట్రాకింగ్ విధానం అవసరం ఉందని భావిస్తున్నామని తెలిపారు.
గత కొన్నేళ్ల నుంచి కేంద్ర విద్యాశాఖ అఖిల భారత ఉన్నత విద్య సర్వే(ఏఐఎస్‌హెచ్‌ఈ)ను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. దానికి సమన్వయకర్త ఉన్నత విద్యామండలేనని స్పష్టం చేశారు. ఈసారి ప్రైవేట్ వర్సిటీలను కూడా ఆ సర్వేలో చేర్చి విద్యార్థుల గణాంకాలు సేకరిస్తామని చెప్పారు. విద్యార్థులు గణాంకాలు లేకుండా, ఏ కోర్సుల్లో చేరుతున్నారో తెలియకపోతే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుందని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
ఇవీ చదవండి: