BRS Focus on Parliament Elections 2024 : శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్(BRS) త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ ఉనికికి ప్రశ్నార్థకంగా మారాయి. అధికారాన్ని కోల్పోయినప్పటికీ పార్టీ బలంగా ఉందనే సంకేతాన్ని ఇచ్చేందుకు అత్యధిక సీట్ల గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 9 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి.
వచ్చే ఎన్నికల్లో కనీసం ఈ సీట్లను అయినా నిలుపుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణులు, నేతల్లో ఉత్తేజం నింపేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. జనవరి మూడో తేదీ నుంచి సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టనుంది. ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి ఈ సన్నాహక సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్(Telangana Bhavan) వేదికగా ఈ సమావేశాలను నిర్వహించనుంది.
BRS Meetings from January 3 : వచ్చే ఏడాది జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో సన్నాహక సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్,11న మహబూబాబాద్, 12న భువనగిరి పార్లమెంట్ సన్నాహాక సమావేశాలు జరగనున్నాయి. సంక్రాంతి అనంతరం16న నల్గొండ, 17న నాగర్ కర్నూలు, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్ గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవ రావు, మాజీ స్పీకర్ మధుసూధనా చారి, మాజీ మంత్రులు హరీశ్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు ఈ సమావేశాలను నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Parliament Elections 2024 : తెలంగాణ భవన్ వేదికగా జరిగే సన్నాహాక సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఎంపీలు, ఆ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ ఛైర్మన్లు, మాజీ ఛైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, మాజీ ఛైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరుకానున్నారు.
BRS Parliament Election Plan : పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. సమావేశాలకు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
బీఆర్ఎస్ హయాంలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించాం - కావాలని బద్నాం చేస్తున్నారు : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది - సిద్ధరామయ్యకు కేటీఆర్ కౌంటర్