BRS Final Selection Of Candidates For Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలకు వేగంగా సిద్ధమవుతున్న భారత రాష్ట్ర సమితి.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు... మరో వైపు పార్టీ కార్యక్రమాలతో కొన్ని నెలలుగా బీఆర్ఎస్ జోరు పెంచింది. సభ్యత్వ కార్యక్రమాలు, కమిటీల ఏర్పాటు, ఆత్మీయ సమ్మేళనాలు, రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాల వంటి కార్యక్రమాల ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన గులాబీ బాస్.. జులై 17న ఆషాడ మాసం ముగిసిన తర్వాత.. మంచి ముహూర్తాన తొలి జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్వేలు, వివిధ అంశాలపై సమాచార సేకరణ ద్వారా.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. 2018 ముందస్తు ఎన్నికలప్పుడు ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్... ఇప్పుడూ అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
BRS Candidates for Telangana Assembly elections 2023 : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలు చేస్తూ అధిష్ఠానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికలకు కొన్ని నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడమే మంచిదని గులాబీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థిపై అసంతృప్తి, అసమ్మతి కనిపిస్తే సరిదిద్దుకోవడానికి, నచ్చ చెప్పడానికి తగిన సమయం ఉంటుందని ఆలోచన. అసంతృప్తులు, అసమ్మతులకు భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని నచ్చచెప్పాలని.. ఒకవేళ వినకపోతే వదులుకోవాలనే కఠినమైన ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆషాడం ముగిశాక 80 మందితో తొలి జాబితా : ముందే అభ్యర్థులను ప్రకటిస్తే.. ఓటర్లను కనీసం మూడు, నాలుగు సార్లు వ్యక్తిగతంగా కలిసేందుకూ వారికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనపై ఆలస్యం చేస్తే నేతల మధ్య పోటీ వాతావరణం శృతి మించడంతో పాటు.. టికెట్ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆషాడం ముగిసిన తర్వాత సుమారు 80 మందితో జాబితా ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే దిశగా కసరత్తు : సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ ప్రాధాన్యం ఇచ్చే దిశగా బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు సాగుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్లో కంటోన్మెంట్ శాసనసభ్యుడు సాయన్న మరణించగా.. ప్రస్తుతం 103 మంది సిట్టింగ్ శాసనసభ్యులు ఉన్నారు. వీరిలో సుమారు పది, పన్నెండు మందిని మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మంది ఇప్పటికే రెండోసారి గెలిచిన వారే. కొంతమందిపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ప్రత్యర్థి పార్టీల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడం వంటివి కలిసొచ్చినట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా లోపాలను గుర్తించిన కేసీఆర్.. కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి.. వారు మార్చుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. అయితే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మారని నేతలు, తరచూ వివాదాల్లో ఉంటున్న వారిని మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో పాటు.. కోర్టు కేసుల్లో త్వరలో తీర్పులు ఎదుర్కోనున్న నేతల విషయంలోనూ తర్జనభర్జన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రులందరికీ టికెట్లు ఖరారు : మంత్రులందరికీ దాదాపుగా టికెట్లు ఖరారైనట్లే తెలుస్తోంది. కేబినెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 17 మంది ఉన్నారు. వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాఠోడ్ ఎమ్మెల్సీలుగా కాగా... మిగతా వారందరూ ఎమ్మెల్యేలే. 14 మంది మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ సంతృప్తిగానే ఉన్నారు. అయితే... తీవ్రమైన ఆర్థిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఓ మంత్రికి సంబంధించిన కేసులో... ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఒకవేళ ఆ కేసులో ఎన్నికల్లోపే ప్రతికూల తీర్పు వస్తే టికెట్‌పై ప్రభావం చూపవచ్చునని ప్రచారం జరుగుతోంది.
ఆ పార్టీల నుంచి వచ్చిన వారికి మళ్లీ టికెట్ : కాంగ్రెస్, టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి 12, టీడీపీ నుంచి ఇద్దరు, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బీఆర్ఎస్లో చేరారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిపై తీవ్రమైన ఆరోపణలతో పాటు... అటు ప్రజలు, ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో వచ్చినందున నాయకత్వం వివిధ కోణాల్లో ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఇచ్చిన హామీ మేరకు మళ్లీ టికెట్ ఇచ్చి ప్రత్యేక వ్యూహంతో గెలవాలా.. లేక వారికి ఎమ్మెల్సీ వంటి హామీ ఇచ్చి కొత్త వారిని దించాలా అనేది ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
20 నుంచి 30 స్థానాల్లో కొత్త అభ్యర్థులు : ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న 15 స్థానాల్లో గతంలో పోటీ చేసిన వారు కాకుండా... కొత్త వారిని బరిలోకి దించేలా కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ నామమాత్రంగానే ఉంటుంది. మొత్తం మీద సిట్టింగ్ స్థానాలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట.. మొత్తం కలిపి సుమారు 20 నుంచి 30 మంది కొత్త ముఖాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి :