BRS Wins in Maharashtra Panchayat Elections 2023 : మహారాష్ట్రలో శుక్రవారం రోజున భారత్ రాష్ట్ర సమితి శాఖ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆ పార్టీకి శుభవార్త అందింది. ఔరంగాబాద్ సమీప గంగాపూర్ తాలూకాలోని అంబేలోహల్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు ఉపఎన్నికలు నిర్వహించగా.. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వార్డు సభ్యుడు గెలుపొందాడు. ఈ గ్రామం గత నెల 24న బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగిన శంభాజీనగర్‌కు సమీపంలో ఉంటుంది. గురువారం ఉపఎన్నిక జరగ్గా.. శుక్రవారం ఫలితం వెలువడింది. పార్టీ బలపర్చిన అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల ఆధిక్యంతో తన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఆయన ఇటీవలే బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సమాచారాన్ని పార్టీ వర్గాలు తెలిపాయి.
BRS's First Victory in Maharashtra : మహారాష్ట్రలో బీఆర్ఎస్ శిక్షణ శిబిరంలో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొని.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కరవుతో అల్లాడిన తెలంగాణ ఇప్పుడు.. దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండిస్తోందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో నిత్యం ఇంటింటికీ తాగునీరందిస్తున్నామని వివరించారు. తెలంగాణ ఏర్పడ్డాక అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. కొవిడ్ కాలం మినహా ఏడున్నరేళ్లలో.. సాగునీరు, విద్యుత్తు, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి సాధించామని ఆయన పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? : అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే దేశమంతా తెలంగాణ మోడల్ కావాలంటోందని వివరించారు. రాష్ట్రంలో సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు ఇక్కడ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆ పథకాలన్నీ అమలు చేస్తామని ప్రజలకు చెప్పండని మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు
గ్రామస్థాయిలో కమిటీలు : మహిళా, దళిత, ఓబీసీ, విద్యార్థి, రైతు, యువత, కార్మిక తదితర విభాగాలకు.. గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. గ్రామ జనాభాను బట్టి 6, 11, 15, 24 మంది చొప్పున సభ్యులుండాలని పేర్కొన్నారు. ప్రచార రథాలు సిద్ధం చేశామని.. ప్రచార సామగ్రితో పాటు ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు పార్టీ బాధ్యులకు అప్పగించనున్నామని వివరించారు. పార్టీ విధానాలు, తెలంగాణలో అమలవుతున్న పథకాలతో రూపొందిన పుస్తకాలు, పాటల సీడీలు, పెన్ డ్రైవ్‌లు, సభ్యత్వ పుస్తకాలు సమకూర్చామని తెలిపారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ అన్నారు. ఈ శిక్షణ శిబిరానికి మహారాష్ట్రలోని 288 శాసనసభ నియోజకవర్గాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఇవీ చదవండి :