బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దర్శక నిర్మాత శేఖర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సుశాంత్ ఇలా కావడానికి కారణమైన వ్యక్తులు తనకు తెలుసని ఆయన సోమవారం ట్వీట్ చేశారు. నటుడు తన భుజాలపై పడి కన్నీరు పెట్టుకున్నట్లు తెలిపారు. ‘నాకు నువ్వు పడ్డ ఆవేదన తెలుసు. నిన్ను దారుణంగా బాధించిన వ్యక్తుల కథలు తెలుసు.
ఇదంతా భరించలేక నువ్వు నా భుజాలపైపడి కన్నీరు పెట్టుకున్నావు. గత ఆరు నెలలు నేను నీ దగ్గరగా ఉండుంటే బాగుండేది. నువ్వు నన్ను కలిసుంటే బాగుండేది. నీకు ఇలా జరగడం వాళ్ల కర్మ. నీది కాదు సుశాంత్’ అని పోస్ట్ చేశారు. నటుడి మరణవార్త తెలిసిన తర్వాత శేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇలా చేసి ఉండాల్సింది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘పానీ’ సినిమా కోసం శేఖర్ కపూర్, సుశాంత్ కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ సినిమా తీయాలనేది శేఖర్ చాలా ఏళ్ల కల. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించాల్సి ఉంది. కానీ అన్నీ కుదిరిన తర్వాత యశ్‌రాజ్ సంస్థ వెనక్కి తగ్గింది. దీంతో 2015లో రూపొందాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. ‘పానీ’ సినిమా కార్యరూపం దాల్చనందుకు నీలాగే నేను ఎంతో బాధపడుతున్నా సుశాంత్ అంటూ అప్పట్లో శేఖర్ కపూర్ పేర్కొన్నారు. కానీ ఓ సినిమా కోసం నీలా కష్టపడే నటుడ్ని నేను ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు’ అని ట్వీట్ చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు